హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): దీపావళి షాపింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ హెచ్చరించారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, నకిలీ ఆఫర్లతో మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు 390 మందిని నమ్మించి రూ.9 లక్షల వరకు మోసం చేశారని చెప్పారు.
నకిలీ వెబ్సైట్లు, ఈ-కామ్స్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఒక్కోసారి ఫోన్లలో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్లు పంపి హ్యాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని, నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు.