విశాఖపట్నం : మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్లింది. గురువారం విశాఖపట్నం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్.. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఈ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని కంగారూ ఓపెనర్లు కెప్టెన్ అలిస్సా హీలి (77 బంతుల్లో 113 నాటౌట్, 20 ఫోర్లు), ఫోబె లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) 24.5 ఓవర్లలోనే దంచేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు అజేయంగా 202 రన్స్ జోడించి మ్యాచ్ను పూర్తి ఏకపక్షంగా మార్చేశారు. ఇదే వేదికపై భారత్తో ముగిసిన మ్యాచ్లో వీరోచిత శతకంతో చెలరేగిన హీలి.. అదే జోరును కొనసాగిస్తూ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడింది.
73 బంతుల్లోనే శతకం బాదిన ఆమె ఇన్నింగ్స్లో 80 పరుగులు ఫోర్ల రూపంలోనే రావడం విశేషం. మరో ఎండ్లో లిచ్ఫీల్డ్ సైతం ధాటిగా ఆడటంతో ఆసీస్ విజయం తేలికైంది. గత మ్యాచ్లలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాకు ఓటమి భయం పుట్టించిన బంగ్లా స్పిన్నర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 198/9 వద్దే ఆగిపోయింది. సొభానా మొస్తరి (66), రుబ్య హైదర్ (44) మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అలానా కింగ్ (2/18) బంగ్లాను కట్టడి చేయగా అన్నాబెల్, వెర్హమ్, గార్డ్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు (వర్షం కారణంగా లంకతో మ్యాచ్ రైద్దెంది) గెలిచిన ఆసీస్.. 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే గాక సెమీస్కూ అర్హత సాధించింది.