సంగారెడ్డి, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో రాజకీయ పెత్తనానికి తోడు పదవుల కోసం కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల మధ్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామస్థాయి వరకు గ్రూపు వార్ కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతున్నది. అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో పదవులు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల గ్రూపు తగాదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో గ్రూపు తగాదాలపై మంత్రి దామోదర రాజనర్సింహా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఈ సమయంలో పార్టీ పటిష్టానికి పనిచేయాలని ముఖ్యనేతలు సూచించారు. నాయకులు గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని క్యాడర్‌కు హెచ్చరించారు. మంత్రి హెచ్చరించినప్పటికీ నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగారంటే గ్రూపు తగాదాలు ఆ పార్టీలో ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూపు విభేదాలు మంగళవారం బట్టబయలు అయ్యాయి. నారాయణఖేడ్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మధ్య కొంతకాలంగా పొసగడం లేదు. నియోజకవర్గంలో రాజకీయ పట్టుకోసం ఇరువురు నేతలు పోటీపడడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎంపీ షెట్కార్ తాను ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడంతోనే సంజీవరెడ్డి ఎమ్మెల్యే అయ్యారని బహిరంగానే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఇది ఎమ్మెల్యే సంజీవరెడ్డికి మింగుడు పడడం లేదు.
ఎవరి రాజకీయ భిక్షతో తాను ఎమ్మెల్యే కాలేదని , రాజకీయంగా బలంగా ఉన్నందునే అధిష్టానం తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, సొంత బలంతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని సంజీవరెడ్డి సమావేశాలు చెబుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరు నేతల మధ్య దూరం పెరగడంతో పాటు క్యాడర్ రెండుగా చీలిపోయి ఎవరికి వారే పనిచేస్తున్నారు. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇద్దరు నేతల మధ్య దూరం పెంచినట్లు తెలిసింది. ఎంపీ సురేశ్ షెట్కార్ తనవర్గం నేతకు మార్కెట్ పదవి దక్కాలని పట్టుబడుతుండగా, ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన అనుచరుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకే పదవి కోసం ఇద్దరు ప్రజాప్రతినిధులు పట్టుబడుతుండటంతో గ్రూపు తగాదాలు మరింత పెరిగేందుకు దారితీశాయి. ఎంపీ సురేశ్ షెట్కార్ తన సోదరుడికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవికోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి సైతం తన సోదరుడిని డీసీసీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఎంపికకు పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ కోసం నారాయణఖేడ్‌లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుదారులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగారు. కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు ఎమ్మెల్యే మద్దతుదారులను దూషించడంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు బాహాబాహీకి దిగారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యనేతల సమక్షంలో నారాయణఖేడ్ కాంగ్రెస్‌లోని గ్రూపుతగాదాలు బట్టబయలు అయ్యా యి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తటపట్టుకుంది.
జహీరాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట కొనసాగుతున్నది. నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా నేతలు ఉజ్వల్‌రెడ్డి, గిరిధర్ ఎవరికి వారే గ్రూపులుగా పనిచేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తన ఓటమికి నియోజకవర్గ ముఖ్యనేతలు గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి కారణమని నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై గతంలో పార్టీ అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్‌కు, నియోజకవర్గ ముఖ్యనేతల మధ్య దూరం పెరిగింది. దీనికితోడు చంద్రశేఖర్, ఉజ్వల్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి ఎవరికివారే సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని తమ మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువయ్యాయని సొంత పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ఎంపీ షెట్కార్ సైతం జహీరాబాద్‌లో వేరే కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం సైతం సొంత పార్టీ నాయకులకు మింగుడు పడటంలేదు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ ఉజ్వల్‌రెడ్డి, గిరిధర్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తుంది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ముగ్గురు మూ డు జాబితాలు ఇవ్వడంతో అధిష్టానం పెద్దలకు ఏమిచేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మిగతా పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంతో పాటు పార్టీ పదవుల్లో సైతం తమదే పైచేయి ఉండాలని ముగ్గురు నేతలు ఎవరికి వారే పోటీపడుతుండడం పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జహీరాబాద్‌లో గ్రూపు తగాదాలపై నియోజకవర్గ నేతలు జిల్లా మంత్రి దామోదరతో పాటు జిల్లాలో పాదయాత్రకు వచ్చిన రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్ట్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడి సస్పెన్షన్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు మరింత ఆజ్యం పోసింది.
నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ ఇటీవల కాంగ్రెస్ జహీరాబాద్ మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేయడంతో పాటు కొత్త అధ్యక్షుడిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమతో చర్చించకుండా చంద్రశేఖర్ ఏకపక్షంగా మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేయటాన్ని గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. నియోజకవర్గంలో చంద్రశేఖర్ పెత్తనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చేశారు. ఇది నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్‌కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీంతో ఆయన గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్రెడ్డిలకు చెక్‌పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉజ్వల్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డిలు జహీరాబాద్ నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రూపుతగాదాలు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానానికి పాలుపోవడం లేదు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, మరోనేత నీలం మధు ముదిరాజ్ మధ్య గ్రూపు తగాదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రాధాన్యత తగ్గింది. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులు ఎంపి క, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పైచేయిగా ఉంది. మంత్రి దామోదరకు సన్నిహితుడైన కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు ఇది మింగు డు పడడం లేదు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన మహిపాల్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం నచ్చని శ్రీనివాస్‌గౌడ్ తరుచూ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్ మధ్య అప్రకటిత వార్ కొనసాగుతున్నది. ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన నీలంమధు ముదిరాజ్ సైతం పటాన్చెరు నియోజకవర్గంలో తన పట్టు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు నచ్చడం లేదు. దీంతో సొంత పార్టీకి చెందిన కాటా శ్రీనివాస్‌గౌడ్, నీలం మధు ముదిరాజ్ వర్గాల మ ధ్య రాజకీయవైరం కొనసాగుతున్నది.