హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడలో నమోదైన దొంగ, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాజ్కుమార్పటేల్ ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. దొంగ, డూప్లికేట్ ఓట్లకు సంబంధించిన ఆధారాలు, సేకరించిన ఎపిక్కార్డులతో ఫిర్యాదు చేశారు. వీటిని వెంటనే ఓటరు జాబితా నుంచి తొలగించాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల అధికారులు సత్వరమే స్పందిం చాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను కాలరాస్తూ దొంగఓట్లను చేర్పించి దొడ్డిదారిన గెలిచేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, బీఆర్ఎస్ యూసూఫ్‌గూడ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, రాకేశ్, హరీశ్‌రెడ్డి, క్రాంతికుమార్, పార్టీ లీగల్ సెల్ మెంబర్ కిరణ్ పాల్గొన్నారు.