న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.40,986 కోట్ల నుంచి రూ.44,490 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2-3 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకోనున్నదని తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. గత త్రైమాసికంలో సంస్థ 3.1 బిలియన్ డాలర్లు లేదా రూ.27,525 కోట్ల విలువైన అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నది. అలాగే ఉద్యోగులు 8,203 మంది పెరిగి 3,31,991కి చేరుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.23 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది డివిడెండ్‌తో పోలిస్తే 9.5 శాతం అధికం.