యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది. సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరత, రైతులు పడుతున్న అవస్థలపై జిల్లా స్థాయిలో సమీక్ష పెట్టి, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన ఇన్చార్జి మంత్రి, ఇతర జిల్లా మంత్రులు..
బుధవారం హైదరాబాద్‌లోని తాజ్హోటల్లో సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చేసినా మీటింగ్‌లో యూరియా అంశం ఉన్నదా..? లేదా..? అనేదానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మీడియాకు అందించిన సమాచారం ప్రకారం చూస్తే.. అసలు అందులో యూరియా అంశమే లేదు. నిజానికి ఇరవై రోజులుగా రైతులు అల్లాడుతున్నా.. ఇన్చార్జి మంత్రి గానీ, జిల్లా మంత్రులు గానీ కొరత తీరుస్తామని స్పష్టమైన ప్రకటన చేసిన దాఖలాలు లేవు.
పోనీ స్థానికంగా అంటే.. జిల్లా కేంద్రాల్లోనైనా కనీసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు, పంట దిగుబడిపై ప్రభావం వంటి అంశాలపై చర్చించడానికి ఆస్కారం ఉండేది. రైతులకు భరోసా దొరికేది. కానీ, స్టార్ హోటల్లో అది కూడా మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు, ఇతర కొంత మంది నాయకులతో మీటింగ్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు మెజార్టీ రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు యూరియా కోసం గోస పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా నిద్రాహారాలు మాని పడిగాపులు గాస్తున్నారు. ఇరవై రోజులుగా సాగు పనులు వదిలి, కోడికూయక ముందే సహకార సంఘాల వద్దకు చేరుకొని క్యూ కడుతున్నారు. అయినా దొరక్కా తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో సమీక్షలు పెట్టి, పరిష్కారం చూపాల్సిన మంత్రులు, హైదరాబాద్‌లో మీటింగ్‌లు పెట్టడం అందులో యూరియా అంశం లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అందులో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీటింగ్‌లో చర్చించిన ప్రధాన అంశాలకు సంబంధించి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రకారం చూస్తే.. జిల్లా అభివృద్ధి, మౌలిక వసతులు.. రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పురోగతి..
అలాగే సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఆర్థిక సహాయం, రైతు రుణమాఫీ, పంటల నష్టపరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్స్, మైనారిటీ- మహిళల అభ్యున్నతి పథకాల అమలుపై సమీక్ష చేశారు. అలాగే రాబోయే రోజుల్లో చేపట్టే ప్రణాళికలు, యువత ఉపాధి అవకాశాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతు బజార్ల విస్తరణ, ఆరోగ్య రంగంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు వంటి అంశాలపై చర్చింనట్టు మీడియాకు సమచారం అందించారు.
యూరియా అంశంపై స్పష్టత కరువు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది యూరియా మాత్రమే. ఈ విషయంలో సమీక్ష జరిగిందా.. లేదా..? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. మీడియాకు ఇచ్చిన సమాచారంలో మాత్రం కొరతను అధిగమించి, రైతుల డిమాండ్ మేరకు ఎప్పటిలోగా పంపిణీ చేస్తారన్న విషయం లేదు. నిజానికి ఇరవై రోజులుగా ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తండ్లాడుతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే చెప్పులను లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చుక్క తెగి పడినట్టు ఎప్పుడో ఒకసారి.. ఆయా ప్రాథమిక సహకారం సంఘాలకు యూరియా లోడ్ వస్తే అక్కడికక్కడే అయిపోతున్నది. నేటికి ఉమ్మడి జిల్లాలో చూస్తే అధికారుల అంచనాల ప్రకారం.. ఇంకా 45 నుంచి 50 శాతం యూరియా రావాల్సి ఉన్నది.
నిజానికి ఈ డిమాండ్ ఇంకా అధికంగానే ఉంటుందని అధికారులే అనధికారికంగా ఒప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం నుంచి క్యూ కడితే.. ఒక్కో రైతుకు ఒక బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. అవి ఏమూలకూ సరిపోవడం లేదు. దీంతో రైతులు మళ్లీ మళ్లీ యూరియా కోసం తిరగాల్సి వస్తున్నది. నిజానికి ఈ సమస్యను ముందు నుంచి సమీక్షించి, ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరతకు పరిష్కారం ఎప్పుడు?
మంత్రులు, ఎంపీలు పట్టింపులేని తీరుపై ఇటీవలే ‘మంత్రులు రారు.. ఎంపీలు పట్టించుకోరు..?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. అందులో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కండ్లకు కట్టింది. అయినా కొరతకు పరిష్కారం చూపాలన్న సోయి పాలకులకు లేకుండా పోయింది. యూరియా సమస్య ఉమ్మడి జిల్లాలో ఉంటే.. స్థానికంగా కాకుండా బుధవారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది.
నిజానికి ఈ సమావేశం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ కేంద్రంగా నిర్వహించి ఉంటే బాగుడేందని రైతులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇన్చార్జిగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు యూరియా కొరత అనేదే ఉండొద్దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మలను ఒప్పించి ఉమ్మడిజిల్లాకు సరిపోయే రీతిలో యూరియాను తెప్పించడంలో జిల్లా మంత్రులు వైఫల్యం చెందారా.. లేక సమన్వయం లోపించిందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సింది యూరియా అంశం.
కానీ, అది మినహా వేరే అంశాలపై చర్చించినట్టు మీడియాకు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది. ఒకవేళ అంతర్గతంగా చర్చించారని భావించినా.. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీర్చడానికి తీసుకున్న చర్యలు ఏమిటీ..? ఎప్పటిలోగా డిమాండ్ మేర రైతులకు ఎరువు అందుతుంది? ఎక్కడి నుంచి యూరియా తెప్పిస్తున్నారు? ఏ జిల్లాకు ఎన్నిరోజుల్లో ఎంత యూరియా వస్తుంది? అన్న వివరాలు వెల్లడించి ఉంటే రైతులకు కొంత భరోసా ఇచ్చినట్టయ్యేది.
కానీ, ఆ ప్రస్తావన చేసిన దాఖలాలు లేవు. నిజానికి స్టార్ హోటల్లో జరిగిన సమీక్ష సమావేశం తీరుపై సొంత పార్టీ నాయకులు కూడా అసహనంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇన్చార్జి మంత్రి జిల్లాకు వచ్చి మీటింగ్ పెడితే.. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఇబ్బందులతోపాటు ఇతర అంశాలు మాట్లాడేందుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం అది లేకుండా చేశారన్న చర్చ ఆ పార్టీలో నడుస్తున్నది. ఏదేమైనా.. ఇప్పటికైనా ఇన్చార్జి మంత్రి అయినా.. యూరియా కొరతను ఎప్పటిలోగా తీరుస్తారో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.
ఏడు గంటలు తిప్పలు పడ్డా దొరకలె
గంభీరావుపేట, ఆగస్టు 20 : గంభీరావుపేట మండల కేంద్రంలోని విజయలక్ష్మి గ్రామైక్య సంఘం ఫర్టిలైజర్ షాపునకు లోడ్ వస్తుందని తెలిసి బుధవారం ఉదయమే 300 మందికి పైగా రైతులు తరలివచ్చారు. అయితే గంట సేపు నిరీక్షించినా లారీ రాకపోవడంతో ఆందోళన చెందారు. ప్రధార రహదారిపైకి చేరుకొని ధర్నా చేశారు. దాదాపు గంట సేపు అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలియడంతో తహసీల్దార్ మారుతీరెడ్డి అక్కడకు చేరుకొని మాట్లాడారు.
యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి, మళ్లీ దుకాణం వద్దకు వెళ్లి క్యూ కట్టారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో 220 బస్తాలతో లారీ లోడ్ రాగా, టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. ఒక్కక్కొరికి ఒక్కో బ్యాగు చొప్పున సాయంత్రం 5.30గంటల వరకు అందజేశారు. దాదాపు వందకుపైగా మందికి అందక నిరాశతో వెనుదిరిగారు. ఒక్క బస్తా కోసం ఏడు గంటలపాటు తిప్పలు పడ్డా యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లోడు పూర్తిగా దించాల్సిందే
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 20: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని హనుమాన్ ఆలయం వద్దకు బుధవారం ఉదయం 10 గంటలకు లారీ లోడు వచ్చిందని తెలియడంతో సుమారు 500 మంది రైతులు అక్కడకు తరలివచ్చారు. లారీలో ఉన్న 460 బ్యాగుల్లో 240 బ్యాగులు ఇక్కడ దింపి, మిగతావాటిని గంభీరావుపేటకు తీసుకెళ్దామనుకున్నారు. విషయం తెలిసిన రైతులు ఆగ్రహించారు. పూర్తి లోడు ఇక్కడే దింపాలంటూ అడ్డుకున్నారు.
ఏవో రాజశేఖర్ వచ్చి, గురువారం మరో లోడు వస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సుమారు గంటన్నరసేపు లారీ అక్కడే నిలిచిపోవడంతో సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంతలోనే కాంగ్రెస్ నాయకుడు, ఏఎంసీ చైర్మన్ సాబెరా బేగం భర్త గౌస్ రైతులను రెచ్చగొడుతున్నారంటూ అక్కడున్న ఇద్దరు నాయకులతో పరుషంగా మాట్లాడారు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, ల్యాగల సతీశ్‌రెడ్డి గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని శాంతింపజేసి అధికారులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడిన అనంతరం గురువారం లోడ్ వస్తుందని ఏవో హామీ ఇవ్వడంతో రైతులు పట్టు వీడారు. ఉదయం 11.45 గంటలకు లారీని అక్కడ నుంచి వెళ్లనిచ్చారు. అనంతరం ఒక్కొక్కరికి రెండు బ్యాగుల చొప్పున 120 మందికి 240 బ్యాగులు పంపిణీ చేశారు. అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు.
మడికో తట్టెడు ఉసికె కలిపి సల్లుమంటరా..?
నేను నాలుగెకరాలు నాటేసిన. ఇప్పటికి నెల పదిహేను రోజులైతుంది నాటేసి. ఇవారకు ఒక సంచి యూరియ దొర్కలే. ఇప్పుడు రైతుకొక్క సంచి ఇత్తమంటున్నరు. ఒక్క సంచిత్తె ఏం జేసుకుంటం? ఎట్ల సల్లుమంటరు? సంచి తీస్కపోయి మడికో తట్టెడు ఉసికె కలిపి సల్లుమంటరా..? సెప్పాలె. తిమ్మాపూర్వోతె వాళ్లు మీ ఊరోళ్లు ఇక్కడికి రావద్దని వాపస్ పంపిచ్చిన్రు. సర్వాయిపల్లి గోదాంకాడికి పోతె వేరే మండలపోళ్లు తీస్కపోతుర్రు మా ఊరోళ్లకు యూరియనే ఇత్తలేరంటున్రు. బొప్పాపూరోళ్లు రైతులు కాదా..? మాకియ్యరా..?
-అరికాల మల్లేశం, రైతు, బొప్పాపూర్, (ఎల్లారెడ్డిపేట)