కట్టంగూర్, ఫిబ్రవరి 18 : లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్రీడా దుస్తులు, షూలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారి ప్రతిభను వెలికితీయచ్చన్నారు. పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను లయన్స్ క్లబ్ వారు దాతృత్వ సేవలకు ఎంపిక చేసుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు దాతలు అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మెరుగైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకటి శంకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ అధ్యక్షుడు తంతెనపల్లి సైదులు, సభ్యులు, దాతలు ముప్పిడి మల్లయ్య, యాపాల బాపిరెడ్డి, మోహన్ రెడ్డి, కొమ్మనబోయిన మారయ్య, కరుణాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొరివి యాదమ్మ, ఉపాధ్యాయులు గాలి సంధ్యారాణి, శ్రీనివాస్, తరాల పరమేశ్ యాదవ్, జానపాటి శంకర్, వార్డు రామచంద్రు, పులకరం నాగరాజు పాల్గొన్నారు.