Premabhishekam | తెలుగు సినీ చరిత్రలో అద్భుత దృశ్యకావ్యం, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం విడుదలై నేటికి 45 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పూర్తి చేరుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసి ఏఎన్ఆర్కి ఘనంగా నివాళులు అర్పించింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో, అక్కినేని వెంకట్ మరియు నాగార్జున నిర్మాణంలో 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా ఎనిమిది కేంద్రాలలో ఏకధాటిగా 365 రోజులకు పైగా ప్రదర్శితమై, తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి ‘ప్లాటినమ్ జూబ్లీ’ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. చక్రవర్తి అందించిన స్వరకల్పనలో “వందనం.. అభివందనం”, “దేవీ మౌనమా” వంటి గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు సరసన శ్రీదేవి, జయసుధ తమ అద్భుత నటనతో పోటీ పడగా, క్యాన్సర్ బాధితుడిగా ఏఎన్ఆర్ పండించిన నటన ప్రేక్షకులను కన్నీటిపర్యంతం చేసింది. విశేషమేమిటంటే, అక్కినేని నాగేశ్వరరావు – అన్నపూర్ణా దేవిల వివాహ వార్షికోత్సవం రోజే ఈ సినిమా విడుదల కావడం, అదే తేదీన ఇప్పుడు 45 వసంతాలు పూర్తి చేసుకోవడం అక్కినేని కుటుంబానికి మరియు అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.