స్పెషల్ టాస్క్ బ్యూరో (హైదరాబాద్), ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు నాలుగేండ్ల కనిష్ఠానికి పడిపోయినప్పటికీ.. ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు నయోపాయాన్ని పన్నింది. ఈ క్రమంలోనే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పైగా తాజా పెంపుతో వినియోగదారుడిపై ఎలాంటి భారం పడబోదంటూ కథలు చెప్పింది. అయితే, భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే, ఆ భారం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతుందంటూ ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. మోదీ పదకొండేండ్ల పాలనలో పెట్రో వాతతో సామాన్యుడి నడ్డి విరిగిందని మండిపడుతున్నారు. ఇదే విషయమై ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించగా.. గత 11 ఏండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వచ్చిన విధానాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది.
ప్రశ్న: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 చొప్పున మోదీ ప్రభుత్వం ఎందుకు పెంచింది? దీంతో ఖజానాకు ఏ మేరకు ఆదాయం రానున్నది?
గ్రోక్: ఆదాయాన్ని పెంచుకోవడానికే కేంద్ర ప్రభుత్వం రూ. 2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్‌పై వడ్డించింది. దేశంలో రోజుకు 9 కోట్ల లీటర్ల పెట్రోల్, 30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. తాజా పెంపుతో కేంద్రానికి రోజుకు రూ. 780 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి ఇది రూ. 2.85 లక్షల కోట్లుగా చెప్పొచ్చు.
ప్రశ్న: ఎక్సైజ్ సుంకం పెంపు పేరిట మోదీ ప్రభుత్వం సామాన్యులను మోసం చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమేనా?
గ్రోక్: నిజమే. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ 60 డాలర్లకు పడిపోయింది. ఇది నాలుగేండ్ల కనిష్ఠం. ఈ లెక్కన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాలి. అయితే, ఆ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. ఎక్సైజ్ సుంకం పెంపు పేరిట ఆ లాభాన్ని కేంద్రం ఖజానాకు మళ్లిస్తోన్నది.
ప్రశ్న: ఏ ప్రధానమంత్రి హయాంలో దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి?
గ్రోక్: మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. 2021లో లీటర్ పెట్రోల్ 130 వరకూ వెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 30 డాలర్లకు పడిపోయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించలేదు. సర్దుబాటు పేరిట ఎక్సైజ్ ఇతరత్రా సుంకాలను పెంచింది.
ప్రశ్న: మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రో ధరలు ఎలా పెరిగాయి?
గ్రోక్: 2014 మేలో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉండేది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 71.51, లీటర్ డీజిల్ రూ. 57.28గా ఉండేది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల ముడిచమురు 60 డాలర్లకు లభిస్తున్నా లీటర్ పెట్రోల్ ధర రూ. 107కు చేరింది. లీటర్ డీజిల్ రూ. 95గా ఉన్నది. 2014 నుంచి 2025 వరకూ పెట్రోల్ ధర 40 శాతం మేర, డీజిల్ ధర 60 శాతం మేర పెరిగింది. 2014లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ. 9.48, రూ. 3.57గా ఉండగా తాజా పెంపుతో ఇది ప్రస్తుతం వరుసగా రూ. 13, రూ. 10కి చేరింది.