రుద్రంపూర్, మార్చి 12 : గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ముఖ్యంగా జీఎం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు వద్ద ఎండలో డ్యూటీలో ఉన్న గార్డులు 8 గంటల పాటు నిలబడే పని చేయాల్సి వస్తుండగా, అక్కడ కనీసం నిలువ నీడ కూడా లేకపోవడంతో తామెక్కడ అస్వస్థతకు గురౌతామోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“గేటును కాపాడుతున్నాం.. కానీ మాకు కాపాడే నీడ లేదు” అంటూ సెక్యూరిటీ గార్డులు తమ పరిస్థితిని వివరించి వాపోతున్నారు. వేసవికాలం ముగిసేంత వరకైనా జీఎం కార్యాలయం వద్ద చలువ పందిర్లు ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం ఉంటుందని వారు కోరుతున్నారు. ప్రత్యేకంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కనీసం తాత్కాలికంగా చలువ పందిరులు లేదా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సెక్యూరిటీ సిబ్బంది వేడుకుంటున్నారు.