హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు ఒక రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, కానీ, తాము మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 14,197 రేషన్‌కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని చిర్రుబుర్రులాడారు. రేషన్‌కార్డులు రద్దు చేయడానికా? సన్నబియ్యం, ఉచితబస్సు రద్దు చేయడానికా? అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రెహ్మత్‌నగర్ డివిజన్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మరోసారి నోరు పారేసుకున్నారు. తన సభలకు ప్రజలు రాకపోవడం, సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో అసహనంతో ఊగిపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిపించాలని సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా కేసులు పెట్టలేదని, ఫార్ములా ఈ-రేస్‌లో కేటీఆర్‌ను అరెస్టు చేయాలని గవర్నర్‌ను అనుమతి కోరితే రెండు నెలలైనా స్పందన లేదని చెప్పారు. కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని, కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బస్తీల్లో పరిశుభ్రత లేదని, జీహెచ్ఎంసీ చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నదని స్థానిక ప్రజలు మంత్రులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వ చేతగానితనాన్ని కేటీఆర్ ఎండగట్టిన నేపథ్యంలో ఫ్రస్టేషన్‌కు లోనైన సీఎం రేవంత్‌రెడ్డి.. తాను బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానన్న విచక్షణ కోల్పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లోని బస్తీల్లో కనీసం చెత్తకుండీలు కూడా శుభ్రం చేయించలేని తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ మీద బురద మాటలతో రెచ్చిపోయారు. నానా దుర్భాషలాడారు.