జూబ్లీహిల్స్ ఎన్నిక ఆషామాషీ కాదు. బీఆర్ఎస్ పాలనలో వికాసానికి.. కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. తీర్పు మీరే చెప్పాలె. మాట తప్పిన కాంగ్రెస్‌కు వాత పెట్టాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలె.
– సోమాజిగూడ రోడ్ షోలో కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సరారా? రౌడీ దర్బారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ అడిగినా బెదిరిస్తున్నాడని, పెన్షనర్లు రెండేండ్ల నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, చూసీచూసీ వారి గుండెలు ఆగిపోతున్నా రేవంత్‌రెడ్డి గుండె మాత్రం కరగడం లేదని మండిపడ్డారు. ‘విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే కాలేజీలు మూయిస్తానంటూ బెదిరిస్తున్నవు. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగ యువతను, డీఏలు, పీఆర్సీలు ఇతర బెనిఫిట్స్ అడిగిన ఉద్యోగులను బెదిరిస్తున్నవు. ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తవ్ రేవంత్‌రెడ్డీ?’ అని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వని రేవంత్ సరారు.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్ముతామని నిలదీశారు. ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని, అదే కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మరో అవకాశం కో సం యాచిస్తున్నదని విమర్శించారు.
ఈ ఎ న్నిక ఆషామాషీ కాదని, పదేండ్ల వికాసానికి.. రెండేండ్ల విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. కేసీఆర్ పాలన బాగున్నదో? రేవంత్ పాలన బాగుందో? జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు చె ప్పాలని కోరారు. ఈ నెల 11న ప్రతి ఒకరూ హకు వినియోగించుకొని కారు గుర్తుకు ఓటే సి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడలో మంగళవారం రాత్రి అశేష జనవాహిని మధ్య రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్, ప్ర జలను ఉద్దేశించి ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఉత్సాహం చూస్తుంటే బీఆర్ఎస్ గెలు పు పక్కా అని తేలిపోయిందని, మెజార్టీ తేలాల్సి ఉన్నదని చెప్పారు. 2023లో హైదరాబాద్‌లో వచ్చిన తీర్పే జూబ్లీహిల్స్‌లో మరోసారి రాబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. ‘అందరికీ అన్నం పెట్టే నగరం హైదరాబాద్. హైదరాబాద్ మహానగరం అమ్మలాంటిది. కల్పతరువు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా అక్కున చేర్చుకుంటున్నది. ఇతర రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఎవరినైనా కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక కష్టాలుండేవి. కరెంటు లేక ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఎండకాలం వచ్చిందంటే తాగునీటికి కటకట ఉండేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని చంటిబిడ్డలా చూసుకొని బాగు చేసిండ్రు.
ఏడాదిన్నర వ్యవధిలోనే రెప్పపాటు కూడా కరెంట్ పోనివిధంగా తీర్చిదిద్దిండ్రు. దెబ్బకు ఇన్వర్టర్లు, జనరేటర్లు మాయమైనయ్. పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా చేసుకున్నం. నదీ జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి తాగునీటి సమస్య తీర్చినం. ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ వం టి ఎన్నో పాలసీలు తెచ్చినం. పెట్టుబడులను ఆకర్షించినం. 3 లక్షల ఐటీ ఉద్యోగులను 10 లక్షలకు తీసుకెళ్లినం. ఫలితంగా రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాలు పెరిగినయి. ఓ లా, ఉబర్, జొమాటో, గిగ్ వరర్లు ఇలా వే లాది మందికి ఉద్యోగాలిచ్చినం’ అని వివరించారు.
బెనిఫిట్స్ అడిగితే రిటైర్డ్ ఉద్యోగులను బెదిరిస్తున్నడు
ఉద్యోగాలు అడిగితే యువతకు ధమ్కీ ఇస్తున్నడు
డీఏలు అడిగితే ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తున్నడు
ఫీజు బకాయిలు కోరితే కాలేజీలను దబాయిస్తున్నడు
ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తవ్ రేవంత్?: కేటీఆర్
‘అభివృద్ధి, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. మడిలో ఉండే రైతులను, బడిలో ఉండే టీచర్లను, విద్యార్థులను, గుడిలో ఉండే పూజారులను, మసీదులో ఉండే ఇమామ్‌లను, చర్చిల్లో ఉండే పాస్టర్లను ఇలా సబ్బండ వర్ణాలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని విమర్శించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 తప్పుడు హామీలిచ్చిందని, వాటిలో ఏ ఒకటీ అమలు చేయకుండా విఫలమైందని విమర్శించారు.
‘అత్తలకు రూ.4 వేలు, కోడళ్లకు రూ. 2500, వృద్ధులకు రూ.4 వేలు పెన్షన్ అన్నరు. తులం బంగారం ఇస్తమన్నరు. యువతులకు సూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రైతన్నలకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణ మాఫీ అన్నరు. రెండేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు అన్నరు. మైనార్టీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్.. సబ్‌ప్లాన్ అన్నరు. ఒకటీ అమలు చేయలేదు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తమన్నరు. ప్రతి వర్గాన్నీ కాంగ్రెస్ మోసం చేసింది’ అని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చెప్పిన మాటల వీడియోలను రోడ్ షోలో ప్రదర్శించారు.
అభివృద్ధి, సంక్షేమంలో బీఆర్ఎస్తో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మడిలో ఉండే రైతులను, బడిలో ఉండే టీచర్లను, విద్యార్థులను, గుడిలో ఉండే పూజారులను, మసీదులో ఉండే ఇమామ్‌లను, చర్చిల్లో ఉండే పాస్టర్లను.. ఇట్లా సబ్బండ వర్ణాలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది.
– కేటీఆర్
తల్లితండ్రులను సరిగ్గా చూసుకోకుంటే జీతాల్లో 15 శాతం కోతపెడతాని ఇటీవల కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించారని కేటీఆర్ గుర్తుచేశారు. మరి తల్లిదండ్రుల వంటి రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించని రేవంత్‌రెడ్డి జీతంలో కూడా కోత పెట్టాలి కదా? అని నిలదీశారు. ‘ఒక చాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం భ్రష్టుపట్టింది. ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలు జరిగింది. రియల్ ఎస్టేట్ నాశనం అయ్యింది.. గురుకులాలు ఆగమైంది.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం చివరి స్థానానికి పడిపోయింది. మళ్లీ ఒక చాన్స్ ఇవ్వండి అని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నవ్ రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు.
నిరుద్యోగులు కొలువులు అడిగితే బెదిరిస్తున్నడు.. ఉద్యోగులు డీఏలు అడిగితే బెదిరిస్తున్నడు.. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తున్నడు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే బెదిరిస్తున్నడు. ఇంతమందిని బెదిరిస్తున్న రేవంత్‌రెడ్డి.. అభివృద్ధి చేస్తనంటే మనం నమ్మాల్నా?
– సోమాజిగూడ రోడ్ షోలో కేటీఆర్
‘కేసీఆర్, కేటీఆర్.. ఈ ఇద్దరి ఉద్యోగాలను ఊడ గొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్తే పాపం విద్యార్థులు నమ్మిండ్రు. ఇప్పుడు ఆ విద్యార్థులే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నరు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభు త్వం పకన పెట్టేసింది. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. బాకీలు అడిగితే కాలేజీలను బ్లాక్ మెయి ల్ చేస్తున్నరు. కాలేజీలు మూయిస్తానంటూ బెదిరిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరో సా లేకుండా పోయింది. దీంతో దళిత, ఆదివాసీ, బహుజన, పేద, అగ్రకుల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నరు.
ఇది నిర్లక్ష్యం కా దు, అణగారిన వర్గాల ఆశలను అణచేందుకు పన్నిన పన్నాగం. విద్యార్థుల ఫీజులు కట్టని సరార్.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్ముతం? ఉద్యోగుల బాధలనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. రెండేండ్లుగా వారు బకాయిల కోసం చూసీ వారి గుండెలు ఆగిపోతున్నయి. కానీ.. రేవంత్‌రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. పైగా బెదిరిస్తున్నడు.. అసలు రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సరారా? రౌడీ దర్బారా? అర్థం కావడం లేదు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇది ఇండ్లు కట్టే ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇండ్లు కూల్చే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘హైడ్రా భూతం పేదల ఇండ్లు కూలగొడుతున్నది. పేదలను బయటకు గుంజుకొచ్చి ఇండ్లు కూల్చుతున్నది. బుక్స్ తీసుకుంటమని చిన్నారులు అడిగితే కూడా కనికరించడం లేదు. పేదల కోసమేనా హైడ్రా? పెద్దలకు వర్తించదా? చెరువుల్లో కట్టిన తిరుపతిరెడ్డి ఇంటికి, మంత్రులు పొంగులేటి, వివేక్ ఇండ్లకు హైడ్రా ఎందుకు వెళ్లదు’ అని నిలదీశారు. హైడ్రా కూల్చివేతల వీడియోలను రోడ్ షోలో ప్రదర్శించారు.
మాగంటి గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని జూబ్లీహ్లిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ చెప్పారు. ‘ఏదైనా సమస్య వస్తే మహిళ నిలబడగలదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. వారికిదే నా సమాధానం.. కుటుంబాన్ని సక్రమంగా తీర్చిదిద్దే మహిళలు సమస్యలు ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు. సంసారాన్ని నడిపే మహిళలు దేన్నయినా చక్కదిద్దగలరు. ఇది ఇప్పటికే నిరూపితమైంది. విద్యావంతురాలినైన నాకు మద్దతు ఇవ్వండి.
నియోజకవర్గ ప్రజలకు గోపన్న అండగా నిలిచారు. ఈ కష్టకాలంలో మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి అశీర్వదించాలని కోరుకుంటున్న. ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రయినా, అపరాత్రయినా ఒక్క ఫోన్‌చేస్తే మీ ఇం టికొచ్చి అండగా నిలబడతా. మీ సునీతమ్మ మీకు అండగా, ధైర్యంగా నిలబడుతది. మన కు భరోసాగా, అండగా కేసీఆర్, కేటీఆర్, విష్ణు ఉన్నరు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’ అని సునీతా గోపీనాథ్ భరోసా ఇచ్చారు.
‘రాష్ట్రంలో చనిపోయిన వారికి గానీ, వారి కుటుంబాలకు గానీ కనీస గౌరవం దక్కడం లేదు.. ఇంత అమానవీయం ఏమిటి?’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘అసలు ఎలాం టి యుగంలో ఉన్నాం? మృతులను తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్తవ్యాన్లు, టోయింగ్ వాహనాల్లో తీసుకెళ్లడం చాలా బాధాకరం’ అని మంగళవారం ఎక్స్ వేదికగా వాపోయారు.
‘జూబ్లీహిల్స్‌లో జరిగేది ఆషామాషీ పోటీ కాదు.. కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. బుల్డోజర్ సరార్కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తిచేశారు. బుల్డోజర్కు అడ్డొచ్చేది కారేనని తేల్చిచెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫు న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్లు ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కోరారు. ‘ఈ ఎన్నిక పదేండ్ల్ల అభివృద్ధి, వికాసానికి, రెండేండ్ల ఆరాచకానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్తో ముం దుకు సాగాలా? లేక కాంగ్రెస్‌తో వెనకివెళ్లాలా? నిర్ణయించుకోవాల్సిన సమ యం వచ్చింది. నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నరు.
నవంబర్ 11న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకొని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ భవిష్యత్తును రక్షించండి. కేసీఆర్ పాలనను తిరిగి తీసుకురావడానికి జూబ్లీహిల్స్ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ఈవీఎంలో మూడో నం బర్పై కారు.. మిగతావి బేకారు’ అని ని నాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పీ విష్ణువర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, అబుఖాన్, ప్రదీప్‌చౌదరి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.