హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్దే గెలుపు అని ఇప్పటికే పలు ప్రఖ్యాత సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ‘మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్’ పేరిట ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ఐఐటియన్ల టీమ్ చేసిన తాజా సర్వేలోనూ జూబ్లీహిల్స్‌లో గెలిచేది కారు పార్టీయేనని తేటతెల్లమైంది. ఈ మేరకు మంగళవారం సర్వే రిపోర్ట్‌ను సదరు సంస్థ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఎస్ఏఎస్ గ్రూప్‌నకు చెందిన ఐఐటీయన్ల టీమ్ అక్టోబర్ 27 నుంచి, నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సర్వే చేసింది. ఇందులో బీఆర్ఎస్కే తమ ఓటు అని సర్వేలో పాల్గొన్న 46.5 శాతం మంది తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు 42.5 శాతం మంది మద్దతు ప్రకటించగా, బీజేపీకి 8.25 శాతం ఓట్లు వచ్చే అవకాశమున్నట్టు సర్వే సంస్థ పేర్కొన్నది. ఇతరులకు 2.75 శాతం మంది ఓటు వేయవచ్చని అంచనా వేసింది. మొత్తంగా కాంగ్రెస్ కంటే 4 శాతం ఎక్కువ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలుపు జెండా ఎగరవేయనున్నట్టు సర్వే సంస్థ కుండబద్దలు కొట్టింది.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు సర్వే సంస్థ తెలిపింది. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ స్కీమ్‌ల అమలు విషయంలోనూ ప్రస్తుత ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నట్టు వెల్లడించింది. నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సర్వే.. వారి మద్దతు బీఆర్ఎస్కే ఉన్నట్టు తేల్చి చెప్పింది. నియోజకవర్గంలో కీలకమైన ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, శ్రీనగర్ కాలనీ వంటి డివిజన్లలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నట్టు వివరించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, ముస్లిం మైనారిటీ వంటి సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయని సర్వే సంస్థ అభిప్రాయపడింది.
ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో వివిధ సర్వే సంస్థలు ప్రీ-పోల్ సర్వేలు నిర్వహించడం పరిపాటే. అయితే, సర్వే శాంపిల్ సైజు, సేకరిస్తున్న వివిధ వర్గాల ఈక్వేషన్ రేషియో, సర్వే విధానం ఇలా పలు కీలక విషయాలు సర్వే చేస్తున్న వ్యక్తులు లేదా సంస్థల విశ్వసనీయతను నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ అన్నిరకాలుగా ఎంతో కచ్చితత్వంతో ఈ సర్వే చేసినట్టు అర్థమవుతున్నది. 27.10.2025 నుంచి 03.11.2025 వరకు 8 రోజులపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో 7 డివిజన్లలో ఈ సర్వే నిర్వహించారు. 4,690 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఎవరిని ప్రశ్నించాలన్న విషయంలోనూ కచ్చితమైన విధానాన్ని పాటించారు. పురుషులు-మహిళల నిష్పత్తి 50:50 ఉండేలా చూసుకొంటూనే.. వయసు, కులం, మతం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, కూలీలు, ప్రభుత్వ-ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు ఇలా సర్వేలో అన్ని వర్గాల వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడ్డారు. అన్నింటికీ మించి సర్వే చేసిన గ్రూప్‌లో ఐఐటీయన్ల భాగస్వామ్యం ప్రధానంగా ఉండటం విశేషం.
