కొండపాక(కుకునూరుపల్లి), మే 24: గుండె జబ్బులతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు అండగా నిలిచి ఉచితంగా ఆపరేషన్లు చేసి పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న నిస్వార్ధ సేవలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయని భారత బ్యాడ్మింటన్ టీమ్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. శనివారం కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానను ఆయన సందర్శించారు.
సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని దవాఖానలో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులకు గిప్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్లను సత్యసాయి సంజీవని దవాఖాన చైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. సమాజంలో స్వార్ధం పెరిగిన ఈ రోజుల్లో సంజీవని దవాఖానలో చిన్నారులకు నిస్వార్ధ సేవలు అందించడం ప్రశంసనీయం అన్నారు. నిరుపేద కుటుంబాలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని, సేవే లక్ష్యంగా సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
చికిత్స కోసం వచ్చే చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించి, ఇప్పటికే 108 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడం చాలా గొప్ప విషయమన్నారు. సత్యసాయి ట్రస్ట్ అందించే సేవలు భవిష్యత్తులో విశ్వవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. అంతకుముందు విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు వరదరాజన్ కృష్ణన్, దవాఖాన ఇన్చార్జి జగన్నాథశర్మ, సిద్దిపేట మెడికల్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.