Sampath Nandi | టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య మంగళవారం (నవంబర్ 25) రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలోని ఓదెల గ్రామం సంపత్ నంది స్వస్థలం. నంది కిష్టయ్య అక్కడే నివసిస్తూ, గ్రామంలో అందరితోనూ మమేకమై ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తొలి సినిమా ‘ఏమైంది ఈవేళ’. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సంపత్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ చిత్రం సంపత్ నందిని పెద్ద దర్శకుల జాబితాలో నిలబెట్టింది. ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ ఈ చిత్రాలు రవితేజ, గోపీచంద్‌లు ప్రధాన పాత్రలలో రూపొందగా, ఈ సినిమాలు ఆయన స్టైలిష్ మేకింగ్‌కు నిదర్శనంగా నిలిచాయి.
నిర్మాతగా కూడా సంపత్ నంది విజయం సాధించారు. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఓదెల 2’ (2024) చిత్రం 2024లో అద్భుత విజయం సాధించింది. కథ, నిర్మాణ విలువలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంపత్ నంది ప్రస్తుతం నటుడు శర్వానంద్ హీరోగా ‘భోగి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది.