Bandla Ganesh | టాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలైన బండ్ల గణేష్ ప్రయాణం స్టార్ హీరోలతో భారీ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా నిర్మాతగాను ఆయన రాణించారు. బండ్ల గణేష్ స్పీచ్లకూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏ ఈవెంట్‌కి వెళ్లినా మైక్ పట్టుకుంటే చాలు మాటల సునామీ వస్తుందని ఇండస్ట్రీకి తెలుసు. నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసే బండ్ల గణేష్, నచ్చని వారిపై సెటైర్లు వేసే తీరూ ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతుంటుంది.ఇటీవల అల్లు అరవింద్, విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు బండ్ల గణేష్‌ను మళ్లీ హాట్‌టాపిక్‌గా మార్చాయి.
కొన్నాళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న ఆయన రీఎంట్రీకి సిద్ధమవుతున్నారనే సంకేతాలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీ దీనికి మరింత బలం చేకూర్చింది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ వేడుకకు హాజరయ్యారు. ఆ పార్టీ కోసం గణేష్ దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.యసోషల్ మీడియాలో తరచూ విచిత్రమైన వ్యాఖ్యలు రాస్తూ వైరల్ అయ్యే బండ్ల గణేష్, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై క్లారిటీ ఇచ్చారు. నా పేరుతో నడుస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు. అది అఫీషియల్ అకౌంట్ కాదు. త్వరలోనే ఒరిజినల్ అకౌంట్ ప్రకటిస్తాను,” అంటూ ఆయన ట్విట్టర్లో స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.
ఈ పోస్ట్ వేగంగా వైరల్ కావడంతో అభిమానులు “ఇన్‌స్టాలోకి ఎప్పుడు వస్తారు?” అంటూ కామెంట్లతో ముంచెత్తారు.
నిర్మాతగా రీఎంట్రీ ఇస్తారా అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్లో నిర్మాత SKN మాట్లాడుతూ..“మేధావుల మౌనం దేశానికి ప్రమాదం… బండ్ల గణేష్ సినిమాలు నిర్మించకపోవడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రమాదం” అని చెప్పడంతో గణేష్ రీఎంట్రీపై మరింత హైప్ పెరిగింది. బండ్ల గణేష్–విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా ప్లాన్ జరిగినా, డేట్స్ సమస్య వల్ల అది ఆగిపోయిందని ప్రచారం. దీంతో ఇటీవల ‘కె ర్యాంప్’ సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండపై గణేష్ పరోక్షంగా సెటైర్ వేసారన్న కామెంట్లు వచ్చాయి.అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.