Heavy Rains | బంగాళాఖాతంలో ఒకేసారి రెండు వాయుగుండాలు కొనసాగుతున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఇవాళ తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 12 గంటల్లో ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది.
వీటి ప్రభావంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.