Sajjala Ramakrishna Reddy | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాలుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించిన చంద్రబాబు.. ‘ సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా? వివేకా హత్య కేసు, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాపై చర్చకు సిద్ధమా ‘ అని వైసీపీ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు. దీనిపై స్పందించిన సజ్జల.. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వమని ప్రతి సవాలు విసిరారు.
అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపిస్తామని తెలిపారు. మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానం చెప్పడానికి జగన్ ఒక్కరు చాలు అని స్పష్టం చేశారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే.. వాటికి సమాధానాలు చెప్పలేక బూతులు తిడుతున్నారని విమర్శించారు.
దమ్ము ఉంటే అసెంబ్లీకి రా అని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని సజ్జల అన్నారు.చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వెంటపడి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఆయన భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కు అభిమానులు ఉండరని.. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన్ను కలిసేందుకు వేలాదిమంది ప్రజలు వస్తున్నారని తెలిపారు. జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు 30 ఏళ్ల సీఎం అంటే.. ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారనేదే గుర్తుకొస్తుందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుపై సంబురాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
Follow Us : on Facebook, Twitter
Chandrababu | సిద్ధమా.. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాలు