Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా, ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.