Chandrababu | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. మొన్నటివరకు సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని నిలదీశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట, బోయినపల్లి మండలాల్లో సోమవారం పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా? వివేకా హత్య కేసు, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాపై చర్చకు సిద్ధమా ‘ అని సవాలు విసిరారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని చంద్రబాబు తెలిపారు. 30 ఏళ్లుగా ఒక మిషన్లా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలని అన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి అధికారం ఇస్తే సొంత పనులకు వినియోగించుకున్నారని మండిపడ్డారు.
సిద్ధం .. సిద్ధం అని నినాదాలు చేసిన వారికి సవాల్.. నేను సిద్ధం…
అసెంబ్లీకి వచ్చేందుకు మీరు సిద్ధమా ?
అసెంబ్లీలో ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో,
ఎవరిది సంక్షేమమో చర్చిద్దాం..
బాబాయ్ హత్యపై కూడా చర్చకు సిద్ధం.
మరి నువ్వు సిద్ధమా? @ysjagan ? #ChandrababuNaidu… pic.twitter.com/hRjBl7uLBK— Telugu Desam Party (@JaiTDP) September 1, 2025
ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరును చంద్రబాబు ఎండగట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా.. వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారని విమర్శించారు. అన్ని సంక్షేమ పథకాలను వారి కార్యకర్తలు, కావాల్సిన వారికే ఇచ్చుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదలను దోచుకునేవారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు టీడీపీ ఎప్పుడూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్లో ఒక ఫేక్ పార్టీ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పిల్లకు బంగారు భవిష్యత్ అందించాలనేదే తన ఆశయమని తెలిపారు.