ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉండటంపై రష్యా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయాన్ని ఏదైనా తటస్థ వేదికకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. రష్యా విదేశాంగ శాఖకు చెందిన అంతర్జాతీయ ఆర్గనైజేషన్ల విభాగం డైరెక్టర్ ప్యోటిర్ ఇలీచెవ్ ఇదే విషయాన్ని చెప్పారు.
‘‘యూఎన్ ప్రధాన కార్యాలయాన్ని తటస్థ వేదికకు మార్చాలనే ఆలోచనపై మేం పాజిటివ్‌గా ఉన్నాం. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలకు సరైన సమాధానాలు ఎదుర్కోవడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
అంతేకాదు, ప్రస్తుతం యూఎన్ కార్యకలాపాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయని, అదే ప్రధాన కార్యాలయాన్ని తటస్థ దేశానికి తరలిస్తే ఇలాంటి అనవసర చర్యలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇలా జరగడం మాత్రం చాలా కష్టమని ఆయన అన్నారు. ఇలా యూఎన్ ప్రధాన కార్యాలయాన్ని మార్చాలంటే సగాని కన్నా ఎక్కువ సభ్య దేశాల ఆమోదం కావాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది జరగడం చాలా కష్టమని తెలిపారు.
2014లో సెక్రటేరియట్ బిల్డింగ్ పునరుద్ధరణ ముగిసిందని, జనరల్ అసెంబ్లీ హాల్ వంటి ముఖ్యమైనవన్నీ దీనిలో ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వీటిని నిర్మించారని, ఇప్పుడు ఈ భవనాలను వదిలేసి మరో చోటుకు వెళ్లడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.