హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే జర్నలిస్టులకు ప్రభుత్వం బడ్జెట్లో మొండిచేయి చూపింది. ఇండ్ల స్థలాల విషయంలో త్వరలోనే తీపి కబురు చెబుతామని, ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు ఇస్తామని పదేపదే చెప్పిన సర్కారు బడ్జెట్లో మాత్రం వాటి ఊసే ఎత్తలేదు. కనీసం జర్నలిస్టుల ప్రస్తావన కూడా బడ్జెట్లో ఎక్కడా లేకపోవడం పట్ల పాత్రికేయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా బడ్జెట్లో రూ.100 కోట్ల చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే.
చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, హెల్త్‌కార్డులు, వివిధ పథకాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యతనివ్వడం వంటి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంపైనా జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి తగిన చర్యలు చేపడుతుందని అందరూ ఆశించారు. కానీ, ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు.
బడ్జెట్లో జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని టీడబ్ల్యూజేఎఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమాచార శాఖను ప్రభుత్వం మరిచిపోయిందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రాంచందర్, బీ బసవపున్నయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. మీడియా అకాడమీ గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదని, నిధులను కేటాయించకుండా సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రస్తావన కూడా ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, కనీసం అక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినా సరార్ స్పందించలేదన్నారు. బడ్జెట్‌పై వేలాది మంది జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుతున్న మీడియా పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని రాంచందర్, బసవపున్నయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్లో జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
బడ్జెట్లో జర్నలిస్టులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం (టీయూడబ్ల్యూజే) విమర్శించింది. జర్నలిస్టులకు గత ప్రభుత్వం కంటే తాము అధికంగా నిధులు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పూర్తిగా విస్మరించారని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతి సాగర్ తెలిపారు.
బడ్జెట్లో జర్నలిస్టుల ఊసే లేదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో అదనంగా రూ.100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయిస్తామని చెప్పి చిల్లి గవ్వ కూడా కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఇండ్ల స్థలాల గురించి ప్రస్తావించకపోవడం, హెల్త్‌కార్డులను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను శాశ్వతంగా రద్దు చేసిందా? అనే అనుమానం కలుగుతున్నదని వివరించారు. తెలంగాణ జర్నలిస్టులకు పూర్తి అన్యాయం చేసిన బడ్జెట్‌గా తాము భావిస్తున్నామని తెలిపారు.