Rupee | ముంబై, నవంబర్ 21: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. గురువారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మరో 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన ముడి చమురు ధరలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తకర పరిస్థితులు.. ఇలా అనేకాంశాలు ఫారెక్స్ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్టు ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య తిరిగి ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో అమెరికా డాలర్.. ఇన్వెస్టర్లకు సురక్షితంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు. ఇక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ), ముఖ్యంగా ఎఫ్ఐఐ తమ పెట్టుబడులను భారతీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఇది కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, రూపాయి విలువ మరింతగా పడిపోతే దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పెద్దగానే ఉంటుందన్న ఆందోళనలు ఇప్పుడు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దిగుమతులు భారమై ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే వీలుందని హెచ్చరిస్తున్నారు.
బంగారం లాంగ్ జంప్
బంగారం ధర ఒక్కరోజే భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్లో గురువారం తులం రూ.1,400 ఎగిసింది. దీంతో ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి విలువ మళ్లీ రూ.80,000 మార్కును సమీపిస్తూ రూ.79,300 పలికింది. ఆభరణాల అమ్మకందారులు, ఇతర వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ చెప్తున్నది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.77,950గా నమోదైంది. 22 క్యారెట్ రూ.71,450 వద్ద ఉన్నది. ఇదిలావుంటే వెండి ధర ఢిల్లీలో రూ.93,000గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్స్ గోల్డ్ 2,695.40 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 31.53 డాలర్లు పలికింది. దీపావళి సమయంలో దేశీయంగా బంగారం ధర తులం ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.82,400 పలికిన విషయం తెలిసిందే. అయితే దేశ, విదేశీ పరిణామాల నడుమ రూ.5,500 మేర పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నది.