RS Praveen Kumar : హైవేల మీద వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసినట్లుగానే ప్రభుత్వం 1800 599 4788 టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టి కమీషన్లు దండుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. 22ఏ కింద బ్లాక్ లిస్టులో పెట్టిన ఆస్తులకు సంబంధించి సర్కారు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. కస్టార్జితమైన ఆస్తులు కూడా కొన్ని పొరపాటున బ్లాక్ లిస్టులో ఉన్నాయని, టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే వాటిని బ్లాక్ లిస్టు నుంచి తీసేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయగానే మాకు 30% ఇస్తే తీసేస్తామని డీల్ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికే ఈ నెంబర్ పెట్టారని ఆరోపించారు. 22-A తీసుకొచ్చి ఆస్తులను, ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టింది మీరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లను కూడా 22-A లోకి తీసుకొచ్చారని అన్నారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ఇంతకుముందు కలెక్టర్లకు, ఎమ్మార్వోలకు తెలియకుండా పొంగులేటి భూభారతిలో 22 వేల ట్రాన్సాక్షన్స్ చేశాడన్నారు. అయితే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదని చెప్పారు.