ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగింజ, తాలు ఉన్నదంటూ సాకులు చెబుతూ మిల్లులకు చేరిన ధాన్యంలో క్వింటాల్‌కు ఐదు కిలోల దాకా కోతలు పెడుతూ అన్నదాతలను మోసం చేస్తున్నారు. కోతలు లేకుండా కొనాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. పట్టించుకోకుండా మేం చెప్పిందే ఫైనల్ అంటూ మిల్లర్లు రెచ్చిపోతున్నారు. ములుగు జిల్లా అంతటా మిల్లర్ల మాయాజాలంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకెళ్లలేక రైతులు నష్టపోవాల్సి వస్తున్నది.
– ములుగు, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, క్వింటాలు సన్నవడ్లకు రూ.500 బోనస్‌ను ప్రకటించడంతో పాటు తాలు, తేమ పేరుతో కోతలు లేకుండా వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు రైస్ మిల్లులకు తరలిన తర్వాత నల్లగింజ, తాలు పేరుతో మిల్లర్లు క్వింటాలుకు 5కిలోలు కోత విధించి దిగుమతి చేసుకుంటామని, కోతలు లేకుండా దించుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. రైస్ మిల్లర్లకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం సహకరిస్తూ కోతల విధింపులో రైతులను అయోమయానికి గురి చేస్తూ క్వింటాలుకు 3 కిలోల నుంచి 5 కిలోల వడ్లను కట్ చేసి ట్రక్ షీట్లు నమోదు చేస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సాబ్పల్లిలోని కొనుగోలు కేంద్రంతో పాటు బండారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మ్యాక్స్ సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు క్వింటాలుకు 5కిలోల వరకు కోతలు విధిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. పాల్సాబ్పల్లిలో రామాంజనేయ రైతు సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి వారం రోజులుగా కూలీలు, యంత్రాల సహాయంతో తూర్పార బట్టి, ఎండబోసి ధాన్యాన్ని విక్రయించారు.
సదరు రైతు సంఘానికి బండారుపల్లిలోని సాయిరామ్ రైస్ మిల్లుతో పాటు పాపయ్యపల్లిలోని లక్ష్మీ రైస్ మిల్లులను అధికారులు కేటాయించారు. ఈ కేంద్రం నుంచి రెండు లారీలను సంబంధిత రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు వంశీ తరలించగా, రైస్ మిల్లుల యజమానులు వడ్లలో నల్ల గింజలు ఉన్నాయనే సాకుతో క్వింటాలుకు 5కిలోల కోత విధించి దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా బండారుపల్లి కొనుగోలు కేంద్రం నుంచి తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు 4 కేజీల చొప్పున కోత విధించి దిగుమతి చేసుకున్నట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు.
పాల్సాబ్పల్లికి చెందిన రామాంజనేయ రైతు సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నాను. కొనుగోలు కేంద్రం నుంచి రెండు లారీల లోడ్ వడ్లను పంపిస్తే క్వింటాలుకు 5 కేజీల కోతను విధించారు. చేసేదేమీ లేక విషయాన్ని రైతులకు చెప్పి దిగుమతి చేశాను. మరో రెండు లారీలను కోతలు లేకుండా గోదాముకు తరలించాం. వ్యవసాయ శాఖ ఏవో సర్టిఫై చేసినా కోతలు తప్పడం లేదు.
– వంశీ, కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు
నేను పండించిన వడ్లలో ముందు 192 బస్తాలను రైస్ మిల్లుకు కొనుగోలు కేంద్రం నుంచి పంపించాను. లారీ రైస్ మిల్లు వద్దకు వెళ్లిన తర్వాత క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తున్నారని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చెప్పాడు. అక్కడిదాక పోయిన వడ్లను వెనక్కి తేలేక కటింగ్‌కు ఒప్పుకున్నాను. ఇది చాలా అన్యాయం.
– తోట రాజు, రైతు
ఆరు ఎకరాల్లో సన్న వడ్లను పండించాం. పంట మొత్తం కోశాక తూర్పార పట్టమని అంటున్నారు. గతంలో ఇలా లేకుండే. వారం రోజులుగా తూర్పార పడుతూనే ఉన్నాం. బోనస్ కింద రూ.500 ఇస్తామని అంటున్నారు సరే, క్వింటా లు ధాన్యంలో 5 కేజీల కటింగ్‌లు దేనికి పెడుతున్నారు. అధికారులు ఇటు వచ్చుడే లేదు. కటింగ్ లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి.
– అంగోత్ సాంబయ్య-సమ్మక్క, రైతు దంపతులు