హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు మార్కెట్ విలువల పెంపు ప్రతిపాదనలతో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ భూములను ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ధరల ఆధారంగా భారీగా పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. బహిరంగ మార్కెట్ ఆధారంగా అశాస్త్రీయంగా భూముల విలువను సవరిస్తే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.