హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్.. బాలికల గురుకులాలు.. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ తదితర పథకాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. విద్యారంగంలో కొత్త అద్యాయానికి నాంది పలికాయి. ఈ పథకాల ఫలితంగా బాలికా విద్య కొత్తపుంతలు తొక్కింది. అమ్మాయిల చదువులకు భరోసా లభించింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పుణ్యామా అని రాష్ట్రంలో బాలికల భవిత ప్రశ్నార్ధకంగా మారబోతున్నది. జీవో-7 కారణంగా పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇకనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీ యాజమాన్యాలకు కాకుండా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జమ (డీబీటీ) చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థులు కాలేజీ ఫీజు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో అమ్మాయిలు చదువు ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇంట్లో పిల్లలు ఎదుగుతున్నారంటే తల్లిదండ్రుల్లో భయం. ఎందుకంటే కాలేజీలో సీటు రాగానే మొత్తం ఫీజు కట్టాలి. ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలియదు. ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో తెలియదు. ఎంత సమకూర్చుకోవాలో తెలియదు. ఏడాది తిరుగగానే మళ్లీ ఫీజులు కట్టాల్సిందే. ఉంటే స్థలం అమ్ముకోవాలి. లేదంటే ప్లాట్ కుదువపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడం, దానిని కేసీఆర్ కూడా కొనసాగించడం పేద వర్గాలకు ఫీజుల బాధలు తప్పాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరుతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల తరగతి గదిలో సగటున 60 మంది విద్యార్థులుంటే.. వీరిలో బాలికలు 10-12 మంది మాత్రమే ఉండేవారు. ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయికి వచ్చేనాటికి బాలికల సంఖ్య ఇంకా తగ్గేది. స్వరాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికల సంఖ్య అధికంగా నమోదవుతున్నది. ప్రతి తరగతి గదిలో 50 శాతానికిపైగా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, గురుకులాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాసంస్థకు వెళ్లి చూసినా.. మార్పు కనిపిస్తున్నది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కనిపించిన ఉదంతాలున్నాయి.
గతంలో అమ్మాయిలు పాఠశాల విద్య దాటటమే గగనంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేస్తే చాలు అన్నట్టుగా పరిస్థితులుండేవి. కానీ, గత కొంతకాలంగా పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. అడ్డంకులను అధిగమించి అమ్మాయిలు ముందడుగేశారు. తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణలక్ష్మీ పథకాలే ఇందుకు దోహదం చేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య అందిస్తుండటంతో అమ్మాయిలు చదువుకొనేందుకు మొగ్గుచూపారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటంతో ఈ మార్పు కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. అమ్మాయిల అడ్మిషన్లు తగ్గడం, డ్రాపౌట్స్ పెరుగడం వంటి పరిస్థితి ఎదురవుతుందునే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో మొత్తం సీట్లు భర్తీకావడం లేదు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కొర్రీలతో వర్సిటీల్లోను డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
