హైదరాబాద్, మే 7 (నమస్తేతెలంగాణ): ‘హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎవరో ఒకరు తంతారని అనుకున్నాం. కరీంనగర్లో అది నిజమైంది’ అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రభుత్వ మరో విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల దాడి ఘటనపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరైనవి కావని, కానీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఎవరో ఒకరు తంతారని అనుకున్నామని, అది కరీంనగర్లో నిజమైందని విజయరమణారావు చెప్పడం పలు విమర్శలకు దారితీసింది.
మరో విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో కరీంనగర్లో గురువారం జరిగిన ఆ పార్టీ శ్రేణుల దాడులే నిదర్శనమని ఆరోపించారు. ఎమ్మె ల్సీ, మరో విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ దాడులతో తెలంగాణలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని బీజేపీ చూస్తున్నదని, ఈ తరహా దాడులు తెలంగాణ సంస్కృతి కాదని తెలిపారు.