హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ పేరుకే బద్ధ శత్రువులని, రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య బలమైన స్నేహం కొనసాగుతున్నదని మరోసారి రుజువైంది. కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ మూకలు దాడిచేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించడమే ఇందుకు మరో ప్రత్యక్ష నిదర్శనం.
ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు వికృత రూపమిచ్చి పేదల ఇండ్ల మీదికి వదిలినప్పుడు బీజేపీ నేతలు నేతలు నోరు మెదపలేదు. రూ.2 లక్షల రుణమాఫీ కోసం అన్నదాతలు ఇప్పటికీ కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నా, కొందరు రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా రేవంత్ సర్కార్‌పై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. నచ్చినప్పుడు అరకొర రైతుభరోసా ఇచ్చి, లక్షల మంది అన్నదాతలను కాంగ్రెస్ దగా చేస్తున్నా ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఒక్కమాట కూడా అడుగడం లేదు.
కాంగ్రెస్ నేతలు కూడా అంతే! కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులు ఇవ్వకపోయినా ఇదేమిటని ప్రశ్నించరు. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి మెట్రో ఫేజ్-2 అనుమతి కోసం అడిగినా కేంద్రం అనుమతించడం లేదు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా 70వ సారి ఢిల్లీకి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారే తప్ప, బీజేపీ నేతలను ఒక్కమాట కూడా అనరు. కానీ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ మీద మాత్రం దాడులకు తెగబడుతాయని, ఈ విషయంలో రెండు పార్టీలు పరస్పరం తోడుంటాయనే ఆరోపణ ఇప్పుడు కరీంనగర్ ఘటనతో మరోసారి రుజువైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న అపవిత్ర బంధం, చీకటి ఒప్పందం కరీంనగర్ సాక్షిగా మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
కరీంనగర్ పట్టణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచర మూకలు రెచ్చిపోయి, గురువారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. కౌశిక్‌రెడ్డిపై దాడికి చేసేందుకు ప్రయత్నించినా, అదృష్టవశాత్తు ఆయన ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బీజేపీ కార్యకర్తల ముసుగులో వచ్చిన గూండాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించారు.
ఈ దాడిని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్దంద్వంగా ఖండించాల్సింది పోయి, వత్తాసు పలికింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడి సత్యం ఈ దాడిని స్వాగతిస్తున్నట్టు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. దాడిని సమర్థిస్తున్నట్టు అధికార పక్షం ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పీసీసీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఆయన ఈ పోస్టు పెట్టి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, సహచర ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నం జరిగిందని తెలిసినప్పుడు అధికార పక్షం ఖండించడం కనీస మర్యాద అని చెప్తున్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి కౌశిక్‌రెడ్డిని పరామర్శించాల్సిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీజేపీతో కలువబోమని దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టేసే సందర్భం వచ్చిందని, బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య చీకటి ఒప్పందం లేదని చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని ముఖ్యమంత్రి ఎందుకు ఖండించరని ప్రశ్నిస్తున్నారు.