హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యాశాఖలో సెంట్రలైజ్డ్ దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో విద్యాసంస్థలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ మొత్తం డీసెంట్రలైజ్డ్ విధానంలో జరిగేదని పేర్కొన్నారు. ఇప్పుడు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్‌గా మార్చేశారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
సీఎం కార్యాలయం నుంచే వేల కోట్ల కాంట్రాక్టులను తమకు నచ్చిన కంపెనీలకు కట్టబెట్టి కమీషన్లు దోచుకునే ప్రయత్నం జరుగుతున్నదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ వ్యవస్థను అమలు చేయడానికి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. టెండర్ల అర్హత నిబంధనలను కావాలనే పెద్ద కంపెనీలకు అనుకూలంగా రూపొదించారని ఆరోపించారు. దీంతో చిన్న పద్మశాలీ కుటుంబాలు, చిన్న తయారీ దారులు టెండర్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్ర్తాలను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ నుంచే కొనాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిందని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ జీవోను పక్కనబెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లకు వెళ్లిందని విమర్శించారు. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన కంపెనీలకు రూ.1200 కోట్ల టెండర్లు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. పేద విద్యార్థులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లల అవసరాల పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతున్నదని మండిపడ్డారు. 40 వేల చేనేత కుటుంబాల ఉపాధిని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, మొత్తం ప్రక్రియపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.