BRS | జనగామ రూరల్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ (BRS) మహిళా ఎమ్మెల్యేపై జరిగిన దాడికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, పెంబర్తి గ్రామ సర్పంచ్ చిన్నబోయిన రేఖ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డిలపై జరిగిన వ్యవహారం తీవ్రంగా ఖండించదగినది అని అన్నారు. ప్రజల తరఫున, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం తప్పా? హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడటం దారుణం అని మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం మా బాధ్యత అని తెలిపారు. ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకు మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి వ్యవహారం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని వెల్లడించారు. సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి నల్లచీర ధరించి నిరసన తెలియజేస్తే ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? ఒక మహిళా ఎమ్మెల్యే చీరను పట్టుకుని లాగడం, ఒకరి గొంతు పట్టుకొని అడ్డుకోవడం ఏ విధమైన సంస్కారం? మహిళలను గౌరవించాలని చెప్పే ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం సభ్య సమాజం తలదించుకునే విషయమని విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పుకునే స్థితి నుంచి, తెలంగాణలో ఈ రోజు పరిస్థితి ఇంత దారుణంగా మారడం బాధాకరం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును, నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును అణచివేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల గొంతుకను అణచలేరు, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.