KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నవతా రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ చేరికలతో బీఆర్ఎస్ రాబోతున్నట్లు ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోందని అన్నారు.
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు . రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిన రేవంత్ సర్కార్.. పథకాలన్నింటినీ బంద్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ.4 వేలు, యువతులకు రూ. 2500, స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఏడు వందల రోజులైనా ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. పైగా తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మెడలో చైన్ కూడా లాగేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న చేరికలతో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. మరో 500 రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని చెప్పారు.
ఇక.. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గోపీనాథ్‌ను తలుచుకొని మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే.. దాన్ని కూడా డ్రామా అంటూ కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.