తెలంగాణపై బీజేపీ బుసకొడుతూనే ఉన్నది. ఈ నేల ఆత్మగౌరవంపై విషం చిమ్ముతూనే ఉన్నది. ఉద్యమకాలం నుంచీ తెలంగాణంటే బీజేపీకి అదే కంటగింపు! రాష్ట్రం ఏర్పడి పుష్కరం దాటుతున్నా ఆ అక్కసు ఆగలేదు, ఆ కడుపుమంట చల్లారలేదు. ప్రజా పోరాటంతో సిద్ధించిన రాష్ర్టాన్ని ఆ పార్టీ నేతలు నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారన్న ప్రధాని వాఖ్యల మొదలు నేటికీ మాటలు తూలుతూనే ఉన్నారు.
బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరుచేసినట్టు అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేశారంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం అభ్యంతరం తెలుపలేదు.
అదే లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ ఒక్కరైనా ఉండి ఉటే పరిస్థితి ఇలాగే ఉండేదా? రాష్ర్టానికి చెందిన 16మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల్లాగా ఇలాగే చోద్యం చూస్తూ ఉండేవారా? తల్లి తెలంగాణను అన్నందుకు నిప్పుకణికలై మండేవారు కాదా?
వరంగల్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తెలంగాణ ఏర్పాటును ఏకంగా దేశ విభజనతో పోల్చారు. అత్యంత చెత్త విధానంతో బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరుచేసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేశారంటూ అక్కసు వెల్లగక్కారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడికి తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా, తెలంగాణ నుంచి ఎన్నికైన 16 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు అదే సభలో ఉండి, పండ్లు ఇకిలించి నవ్వారే తప్ప ‘ఇదేమిటి?’ అని ఒక్కరు కూడా మాటవరుసకైనా అనలేకపోయారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులు, ఎంపీలు అదే పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్నా ఒక్కరైనా నోరుమెదపలేకపోయారు. అయితే.. అదే ఎంపీ తేజస్వీ సూర్య తమిళనాడు ప్రభుత్వం భాషావేర్పాటువాదం ప్రదర్శిస్తున్నదంటూ ఒక్క మాట అనగానే, తమిళనాడు ఎంపీలంతా లేచి నిరసన తెలిపారు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గుడ్లప్పగించి చూశారే తప్ప కనీసం అడ్డుచెప్పిన పాపాన పోలేదు. దీనిని బట్టి రాష్ట్రం ఏర్పడి 13 ఏండ్లు కావస్తున్నా బీజేపీ, కాంగ్రెస్‌కు తెలంగాణపై అక్కసు తగ్గలేదని మరోసారి తేలిపోయింది.
ఆవిర్భావానికి ముందునుంచే బీజేపీ విషం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ మొదటినుంచీ జీర్ణించుకోలేకపోతున్నది. తెలంగాణ అస్తి త్వం, ఆత్మగౌరవంపై ముప్పేట దాడి చేస్తున్నది. 2014లో ప్రధాని మోదీ నుంచి, గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య దాకా సమస్త బీజేపీ పటాలమంతా తెలంగాణపై కాలకూటవిషాన్ని కక్కుతున్నది. సందర్భం లేకపోయినా, రాజకీయ సభ అయినా, దేశ అత్యున్నత ప్రజాస్వామ్య ప్రతిరూప వేదిక లోక్‌సభ అయినా తెలంగాణ రాష్ర్టాన్ని అవమానిస్తూనే ఉన్నది. స్వరాష్ట్ర ఏర్పాటుకోసం దశాబ్దాలపాటు అలుపెరుగకుండా చేసిన ఉద్యమాన్ని పలుచన చేసి, వందలాది మంది బిడ్డల ఆత్మబలిదానాలను అవహేళన చేస్తూనే ఉన్నది. దేశంలో తక్కిన రాష్ర్టాలు ఏర్పడినప్పుడు పడని ఈర్ష్యాద్వేషాలను తెలంగాణపైనే వెదజల్లుతున్నది. అసలు రాష్ట్రం ఏర్పడకపోతే బాగుండుననే మనసులోని మాటను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నది.
దాయాది రాష్ర్టాలుగా మారుస్తారా?
బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వైఖరి చూస్తుంటే తెలంగాణ రాష్ర్టాన్ని తమ బద్ధశత్రువుగా గుర్తిస్తున్నాయా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం తేజస్వీసూర్య వ్యాఖ్యలను, సభలో ఉండి అడ్డుకోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వైఖరి అదే అభిప్రాయంతో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దేశంలో అనేక రాష్ర్టాలు ఆవిర్భవించాయి. వాటిపై లేని అక్కసును తెలంగాణపై ప్రత్యక్షంగా అధికర పక్షం, పరోక్షంగా విపక్షం జతకూడి ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. రాష్ట్ర విభజనను భారత్, పాకిస్థాన్ విభజన కంటే దారుణంగా ఉందని బీజేపీ ఎంపీ పేర్కొనడం వెనుక తెలంగాణ, ఏపీ ప్రజలు శాశ్వత శత్రువులుగా కొట్లాడుకోవాలని బీజేపీ భావిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పండ్లు ఇకిలించి బల్లలు చరుస్తరా?
రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ తప్పుబడుతుంటే 16మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పండ్లు ఇకిలించి బల్లలు చరుస్తారా? అని తెలంగాణ సమాజం ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ ఎంపీ తేజస్వీ లోక్‌సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలందరూ సభలో ఉన్నా ఏ ఒక్కరూ నోరు తెరువకపోవడం దారుణమని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ఇంటోడుపోయి దొంగల్ల కలిసినట్టే ఎంపీ ల వ్యవహారం ఉన్నదని ఆగ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా పార్లమెంట్ వేదికగా అడ్డగోలు అబద్ధాలను వల్లెవేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు మండలాలు ఏపీకి ధారాదత్తం అయ్యిం ది రాష్ట్ర విభజన బిల్లులోనే అని అసత్య ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా సంద ర్భం వచ్చిన ప్రతిసారీ తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నదని తెలంగాణవాదులు కన్నెర్రజేస్తున్నారు.
బాబుతో దోస్తీ కట్టి తెలంగాణపై దండయాత్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటినుంచి వ్యతిరేకించిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనతో జతకట్టి సందర్భం వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ బలిపెడుతున్నది. తన మిత్రుడికి శత్రువు తనకూ శత్రువే అన్నట్టు తెలంగాణపై వివక్ష పదర్శిస్తున్నది. అదే పార్లమెంట్ వేదికగా గత నెల 10న టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బ్లాక్‌డేగా అభివర్ణించారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల్లో ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’ అంటూ కొత్తరాగం అందుకున్న రెండు కండ్ల సిద్ధాంతకర్త చంద్రబాబు కూడా తమ పార్టీ ఎంపీని మందలించిన పాపానపోలేదు. దీనిని బట్టే చంద్రబాబు కండ్లల్లో ఆనందాన్ని నింపేందుకు అవకాశం వస్తే తెలంగాణ గడ్డపై దండయాత్ర చేసేందుకు వెనుకాడమనే రీతిలో బీజేపీ వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చల్లో పదేపదే తెలంగాణ ఏర్పాటు అంశం తేవడం వెనుక మోదీ, బాబు రహస్య ఎజెండా ఉన్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా తెలంగాణ గడ్డ నుంచి గెలిచిన 16 మంది ఎంపీలు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
పిడికిలెత్తిన తమిళులు.. మన ఎంపీల పరాధీనత
ఆత్మగౌరవానికి అసలు సిసలు సాక్ష్యం తమిళనాడు ప్రజాప్రతినిధులని మరోసారి నిరూపించారు ఆ రాష్ట్ర ఎంపీలు. గురువారం లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, వీటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులపై చర్చ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. బీజేపీ ఎంపీ తేజస్వీ తెలంగాణపై విషం కక్కేముందు ‘తమిళనాడులో డీఎంకే భాషా వేర్పాటు వాదం ప్రదర్శిస్తున్నది’ అని పేర్కొన్నారు. అంతే సభలో ఉన్న తమిళనాడుకు చెందిన సభ్యులు పార్టీలకతీతంగా లేచి నిరసన తెలిపారు. ఆ సమయంలో ప్యానల్ చైర్మన్‌గా ఉన్న (స్పీకర్ స్థానంలో ఉన్న) ఎన్కే ప్రేమ్‌చంద్రన్ సైతం ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలను సవరించుకోవాలని సూచించారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాన్ని, దేశభక్తిని తమిళనాడు ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ అదే వేదికగా అదే ఎంపీ తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్, పాకిస్థాన్‌తో పోల్చినా ఈ గడ్డ నుంచి గెలిచిన మంత్రులు, ఎంపీలు అభ్యంతరం కూడా చెప్పకపోవటం మనవాళ్ల పరాధీనతకు పరాకాష్టగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎంత తేడా!
తెలంగాణపై విషం చిమ్మడానికి ముందు అదే బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తమిళనాడుపైనా నోరుపారేసుకున్నారు. ‘తమిళనాడు రాజకీయ పక్షాలు భాషావేర్పాటువాదాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అన్నారు. అంతే! సభలో ఉన్న తమిళ ఎంపీలు భగ్గున మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా లేచి నిరసన తెలిపారు. ప్యానల్ చైర్మన్‌గా ఉన్న ఏకే ప్రేమ్‌చంద్రన్ సైతం తేజస్వీ వ్యాఖ్యలను సవరించుకోవాలని సూచించారు. మరి తెలంగాణను అంటే ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు నోరెందుకు రాలేదు?
బీజేపీ విషం: ‘భారత్, పాకిస్థాన్‌ను ఎంత దుర్మార్గంగా విభజించారో, అంతకన్నా ఘోరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగింది’
– పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య
మన ఎంపీల మౌనం: కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 16మంది బీజేపీ, కాం గ్రెస్ ఎంపీలు అక్కడే ఉన్నారు. అందులో ఏ ఒక్క రు కూడా అదేమిటని ప్రశ్నించిన పాపానపోలేదు.
తమిళ ఎంపీల పోరాటం: తెలంగాణపై విషం చిమ్మేకన్నా పది నిమిషాల ముందు తేజస్వీసూర్య ‘తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ భాషాదురభిమానం ప్రదర్శిస్తున్నది’ అని పేర్కొన్నారు. అంతే.. సభలో ఉన్న తమిళనాడు సభ్యులు పార్టీలకతీతంగా లేచి నిరసన తెలిపారు. ప్యానల్ చైర్మన్‌గా ఉన్న ఎన్కే ప్రేమ్‌చంద్రన్ సైతం తేజస్వీ వ్యాఖ్యలను సవరించుకోవాలని సూచించారు.
మోదీ విషపు వ్యాఖ్యలు
అమిత్‌షా ; 2019 ఆగస్టు 6: (పార్లమెంట్లో) ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనను కాంగ్రెస్ ఆమోదించిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి’
తేజస్వీ సూర్య; 2026 ఏప్రిల్ 16: ‘ఎంత దుర్మార్గంగా, అత్యంత చెత్తవిధానంలో భారత్, పాకిస్థాన్‌ను విభజించారో, అంతకన్నా ఘోరంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది’