హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజన తీరుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వీ వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దబాయించారు. భారత్-పాకిస్థాన్ విభజన సందర్భంగా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని, అదేవిధంగా తెలంగాణలో సైతం ప్రాణత్యాగాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు జరిగిందనే సందర్భంలో తేజస్వీ సూర్య ఆ వ్యాఖ్యలు చేశారని డ్యామేజ్ కంట్రోల్‌కు రామచందర్‌రావు యత్నించారు. తేజస్వీ సూర్య మాట్లాడిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.