హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 1617 కిలోమీటర్ల పొడవైన 16 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇండస్ట్రియల్ కారిడార్లను కలుపుతున్న రహదారులను అప్గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకతను గతంలోనే బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు.. కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ ఏండ్లు గడిచినా వినతిపత్రాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణపై మోదీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని రాజకీయవర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు రోడ్లను అద్భుతంగా విస్తరించింది. అలాగే రాష్ట్రంలోని 16 ప్రధాన రాష్ట్ర రహదారులను నాలుగు లేన్ల జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఆయా రహదారుల ప్రాధాన్యతను కేంద్రానికి పలుదఫాలుగా వివరించింది. నరేంద్రమోదీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. కేంద్రం నిర్ణయం కోసమే నిరీక్షిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్అండ్బీ వర్గాలు చెప్తున్నాయి. మోదీ సర్కారు పచ్చజెండా ఊపితే 1600 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల రూపురేఖలు మారుతాయని, లేదంటే ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్అండ్బీ అధికారులు వాపోతున్నారు.