మక్తల్ : లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే (Compensation ) నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal lift irrigation ) భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి( Minister Srihari ) కి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. భూ బాధితుల జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డిI Venkata Ramreddy) మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాట్రేపల్లి నుంచి నారాయణపేట జిల్లాలోని కాన్కుర్తి గ్రామం వరకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఈ ఎత్తిపోతల వల్ల భూముల కోల్పోతున్న రైతులకు, మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతనే, భూ సేకరణ చేపట్టాలని మరోమారు మంత్రిని కోరారు. అధికారులు రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, రైతులకు తెలియకుండానే రైతుల పొలాల్లోకి వచ్చి సర్వేలు చేయడం, రైతుల వద్ద అవార్డు కాపీలపై బలవంతంగా సంతకాలు చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో చేపడుతున్న పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఏ విధంగా పరిహారం చెల్లిస్తున్నారో, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతన్నలకు సైతం అదే విధంగా పరిహారం అందించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు తప్ప, స్పష్టమైన పరిహారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని వాపోయారు.
భూముల కోల్పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా న్యాయమైన పరిహారం వస్తే తప్ప, భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మంత్రికి వినతి పత్రం అందించిన వారిలో సింగారం, కాన్కుర్తి, పేరపల్ల, మల్ రెడ్డి పల్లి, కాచివార్, కాట్రేపల్లి గ్రామ రైతులు గోపాల్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, జిలాని, తరుణ్ రెడ్డి, రాజు గౌడ్, మచ్చేందర్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు, రాధాకృష్ణ లతోపాటు అన్ని గ్రామాల రైతులు ఉన్నారు.