హాలియా, ఆగస్టు 9 : వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాలన్నీ పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే శ్రీశైలం జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉన్నదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి చేపడితే అక్కడి నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి రోజుకు 50 నుంచి 60 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. రెండు రోజులుగా శ్రీశైలంలో జల విద్యుత్తు చేపడుతుండటంతో నాగార్జున సాగర్‌కు ఐదు అడుగుల మేర నీరు వచ్చి చేరిందని తెలిపారు.
ప్రస్తుతం సాగర్ జలాశయంలో 517 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జలాశయం డెడ్‌స్టోరేజీకి చేరినప్పటికీ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో 18సార్లు సాగర్ ఎడమ కాలువకు రెండు పంటల సాగు కోసం నీటిని విడుదల చేసిన ఇక్కడి రైతులను ఆదుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురువాలని, ప్రాజెక్టులు, చెరువులు నిండాలనే ఉద్దేశంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో వరుణ యాగం నిర్వహించడం మంచిదే అయినప్పటికీ సాగర్ ఎడమ కాలువకు సాగునీరు ఇవ్వనప్పుడు యాగం ఎందుకని మాజీ ఎమ్మెల్యే భగత్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు వరుణయాగం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.