నమస్తే నెట్వర్క్, ఆగస్టు 9 : ‘వర్షాలను సమృద్ధిగా కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..’ అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మహిళలందరూ గ్రామదేవతలైన అమ్మవార్లకు ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు నిండుగా ఉండాలని, ఈ సీజన్లో వచ్చే వ్యాధులను పారదోలాలని అమ్మవార్లకు వేడుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తులు కూడా అమ్మవార్లు, పోతురాజుల వేషధారణలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆషాఢమాస బోనాల వేడుకల సందర్భంగా పల్లెల్లోని గ్రామ దేవతల ఆలయాలు, బొడ్రాయి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. పల్లెవాసుల ఇళ్లన్నీ బంధువులతో కళకళలాడాయి.