ముంబై, డిసెంబర్ 6 : దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్యసమీక్షలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఆర్బీఐ తగ్గించిన జీడీపీ వృద్ధిరేటు అంచనాలే ఇందుకు నిదర్శనం. ఈసారి 6.6 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చని ఆర్బీఐ పేర్కొన్నది మరి. గతంలో 7.2 శాతంగా ఈ అంచనా ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ అధికారిక గణాంకాలు 7 త్రైమాసికాల కనిష్ఠాన్ని తాకుతూ 5.4 శాతంగానే నమోదైన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కూడా ఒకింత ఆందోళన వెలిబుచ్చిన సంగతి విదితమే. కాగా, అకాల వర్షాలు ఆగిపోతే, కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాభివృద్ధికి పెట్టుబడులను పెడుతూపోతే వృద్ధిరేటు తిరిగి పుంజుకోవచ్చన్న ఆశాభావాన్ని శుక్రవారం ద్రవ్యసమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయా రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని, ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోయవచ్చన్న ఆందోళననూ కనబర్చారు. ఇదిలావుంటే ఊహించినట్టుగానే తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనూ రెపో రేటు జోలికి ఆర్బీఐ వెళ్లలేదు. ఆరుగురు సభ్యుల ద్రవ్యవిధాన కమిటీలో నలుగురు కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచేందుకు మొగ్గుచూపారు.
ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవని ఆర్బీఐ తేల్చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను పావు శాతానికిపైగా పెంచేసింది. 4.8 శాతంగా ప్రకటించింది. మునుపు ఇది 4.5 శాతంగానే ఉండటం గమనార్హం. ఇక ఆహారోత్పత్తుల ధరలు అదుపులోకి రావడం లేదని, దీంతో ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగేందుకే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్తున్నారు. 5.7 శాతంగా నమోదు కావచ్చన్నారు. అయితే జనవరి-మార్చిలో 4.5 శాతానికి దిగిరావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరిన సంగతి విదితమే. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. కూరగాయలు, వంటనూనెలు, పప్పుధాన్యాల రేట్లకు రెక్కలు తొడగడమే ఇందుకు కారణం.
ఆర్థిక మోసాలకు తావిస్తున్న మ్యూల్ అకౌంట్లకు అడ్డుకట్ట వేసేందుకు ‘మ్యూల్‌హంటర్.ఏఐ’కి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగస్వామ్యం కావాలని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. డబ్బును ఎరగా చూపి అమాయకుల చేత బ్యాంకుల్లో నేరగాళ్లు తెరిపించే ఖాతాలనే మ్యూల్ అకౌంట్స్ అంటారు. అయితే క్రిమినల్స్ తమ అక్రమార్జనను ఈ ఖాతాల్లో భద్రపర్చుకొని తప్పించుకు తిరుగుతుండటాన్ని ఆర్బీఐ గుర్తించింది. ఈ ఖాతాలను కనిపెట్టి చెక్ పెట్టడంపై దృష్టి పెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్.. మ్యూల్‌హంటర్.ఏఐని అభివృద్ధిపర్చింది. రెండు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి చేపట్టిన మ్యూల్‌హంటర్.ఏఐ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉత్సాహవంతమైన ఫలితాలు వచ్చాయనీ దాస్ చెప్పారు. కాబట్టి బ్యాంకులన్నీ సహకరిస్తే ఈ అక్రమ కార్యకలాపాలకు ఇట్టే చెక్ పెట్టవచ్చన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం మ్యూల్‌హంటర్.ఏఐని వినియోగిం చుకోవాలని బ్యాంకులకు సూచించింది.
ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నడుమ కీలక వడ్డీరేట్ల తగ్గింపుల జోలికి వెళ్లలేకపోతున్న ఆర్బీఐ.. ఆర్థిక మందగమనం సంకేతాల మధ్య ఈసారి ద్రవ్యసమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని తగ్గించింది. తద్వారా మార్కెట్లో రుణ లభ్యతను పెంచింది. అర శాతం కోత పెడుతూ 4.5 శాతం నుంచి 4 శాతానికి సీఆర్ఆర్ను పరిమితం చేసింది. ఈ నిర్ణయం రెండు విడుతల్లో అమల్లోకి రానుండగా, డిసెంబర్ 14, 28 తేదీల్లో బ్యాంకులకు సీఆర్ఆర్ మిగులు నిధులు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. దీంతో బ్యాంకుల్లోకి అదనంగా రూ.1.16 లక్షల కోట్ల నగదు నిల్వలు రానున్నాయి. 2022 మే 4న సీఆర్ఆర్ను 4 శాతం నుంచి 4.5 శాతానికి ఆర్బీఐ పెంచింది. మే 21 నుంచే ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి అది అలాగే ఉన్నది. కాగా, వాణిజ్య బ్యాంకులు తాము కస్టమర్ల నుంచి సేకరించిన డిపాజిట్లలో కొంతమేర బ్యాంక్ వాల్ట్స్‌ల్లో లేదా ఆర్బీఐ వద్ద పెట్టాల్సి ఉంటుంది. ఆ మొత్తాలకు సంబంధించిన నిష్పత్తే సీఆర్ఆర్. ఇప్పుడు బ్యాంకులు తమ డిపాజిట్లలో 4 శాతం పక్కకు పెట్టాల్సి ఉంటుంది. వీటిపైన బ్యాంకులకు ఎలాంటి ఆదాయం ఉండదు. ఖాతాదారుల ప్రయోజనార్థం ఆర్బీఐ సీఆర్ఆర్ను అమలుపరుస్తూ ఉంటుంది.
వరుసగా 11వ ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచిన నేపథ్యంలో వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం కట్టడే తమ లక్ష్యమని, ధరల గుర్రానికి కళ్లెం వేయడంపైనే ప్రధానంగా దష్టి పెడుతాంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక ఈ జూలై-సెప్టెంబర్‌లో దేశ జీడీపీ 5.4 శాతానికి పడిపోవడం, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటేయడంతో వృద్ధిరేటును పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని దించేందుకు అవసరమైన అన్ని సాధనాలనూ ఉపయోగిస్తున్నామని దాస్ చెప్పారు.
పదవీకాలం పొడిగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘ఈ విషయంలో నేను మీకు ఏ హెడ్లైన్ ఇవ్వను’ అంటూ దాస్ సమాధానాన్ని తోసిపుచ్చారు. ఈ నెల 10తో ఆర్బీఐ గవర్నర్‌గా దాస్ పదవీకాలం ముగియనున్నది. ఇప్పటికే దాస్ టెన్యూర్‌ను కేంద్ర ప్రభుత్వం మూడేండ్లు పెంచిన విషయం తెలిసిందే. 2021లో పదవీకాలం నెల రోజుల్లో ముగుస్తుందనగా పొడిగించారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ రాజీనామాతో దాస్ వచ్చిన సంగతి విదితమే. ఇక ఆర్బీఐ చరిత్రలో అత్యధిక కాలం గవర్నర్‌గా పనిచేసినవారి జాబితాలో బెనగల్ రామారావు తర్వాత దాస్దే స్థానం. ఆర్బీఐ తదుపరి గవర్నర్ ఎవరన్నది ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది.
ఈసారి ద్రవ్యసమీక్షలో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు కలిసొచ్చే నిర్ణయాలనే ఆర్బీఐ ప్రకటించింది. సీఆర్ఆర్ తగ్గింపు, విదేశీ కరెన్సీ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు, పూచీకత్తులేని వ్యవసాయ రుణాల పరిమితిని పెంచడం బాగుంది.
ఆర్బీఐ పరపతి విధానం ఊహించినట్టుగానే ఉన్నది. అయితే సీఆర్ఆర్ తగ్గింపును ఇండస్ట్రీ తరఫున స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం దేశ జీడీపీ వృద్ధిరేటుకు ఊతమివ్వగలదు.
దేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని ఉత్పాదక రంగాలకు సీఆర్ఆర్ తగ్గింపుతో అదనపు నగదు వనరులు అందుబాటులోకి రాగలవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం బాగుంది.
వడ్డీరేట్లు గతకొంత కాలంగా స్థిరంగానే ఉంటుండటంతో నిర్మాణ రంగంలో హౌజింగ్ డిమాండ్ కూడా సజావుగానే సాగుతున్నది. వచ్చే ఏడాది ద్రవ్యసమీక్షల్లోనైనా వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశిస్తున్నాం.
ఎగుమతిదారులు ఇప్పటికే నగదు కొరత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో సీఆర్ఆర్ను ఆర్బీఐ తగ్గించడం వల్ల రుణాల ద్వారా వారికి నగదు లభ్యత పెరుగుతుంది.