మహిళా సాధికారత అసాధ్యం అనుకున్న రోజులు పోయి.. సుసాధ్యం చేసే దిశగా మార్పు మొదలైంది. అమ్మాయిలూ బాగా చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అయినా ఎక్కడో కొంత వెలితి కనిపిస్తున్నది. సరైన అవకాశాలు లభించక కొందరు, అనుకూలమైన మార్గం కనిపించక మరి కొందరు మహిళలు తమ కలలను మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. ఇలాంటి అడ్డంకులను తొలగించేందుకు ఒక్క మహిళ ముందుకొచ్చారు. తోటి మహిళల కలలను నిజం చేసేందుకు, వారికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఇందు కోసం ‘ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ (ఐఐడబ్ల్యూ)’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయురాలు రష్మి మిశ్రా.
సమాజంలో పేరుకుపోయిన వివక్ష.. ఆడపిల్లలకు అవకాశాలను పరిమితం చేస్తున్నదని రష్మి భావన. డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా.. చాలామంది యువతులు తమ అర్హతకు తగ్గ ఉద్యోగం సంపాదించడానికి మగవారితో పోలిస్తే చాలా కష్టపడాల్సి వస్తున్నదని ఆమె అభిప్రాయపడేవారు. మల్టీటాస్కింగ్‌లో ముందుండే ఆమె ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించేవారు. అలా అనుకొని ఊరుకోలేదు! సాటి మహిళలు మేటిగా నిలవాలనే సంకల్పంతో 2018లో ఐఐడబ్ల్యూ సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ సంస్థ అతివల పాలిట నిచ్చెనగా మారింది. ఐఐడబ్ల్యూ తోడ్పాటుతో ఎందరెందరో మహిళలు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని రష్మి గర్వంగా చెబుతారు.
బ్రిటన్‌లో స్థిరపడిన రష్మి అక్కడే ఓ పాఠశాలలో 25 ఏండ్లపాటు ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. తన విద్యార్థులకు, తోటి టీచర్లకు ఎఫ్పుడూ ఆదర్శంగా ఉండేవారు. పరిశోధనాత్మక విషయాలు, భవిష్యత్తులో రాబోయే మార్పులు, ఉద్యోగ అవశాలు, ఆదర్శ వనితల గురించి విద్యార్థులకు తరచూ బోధించేవారు. ఆ సమయంలోనే తన విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించాలని జాతీయ, అంతర్జాతీయ ఇన్నోవేటర్లను ఒక వేదికపైకి తీసుకురావాలని పలు కార్యక్రమాలు చేపట్టారు. అలా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి సామాజిక మార్పు కోసం తనవంతు ప్రయత్నాలు కొనసాగించారు రష్మి.
ప్రపంచంలోని భారతీయ మహిళలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐఐడబ్ల్యూకి అంకురార్పణ చేశారు రష్మి. ఈ సంస్థలో మహిళలే తోటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా పని చేస్తుంటారు. అలాగే ఒకరికొకరు అన్ని విషయాల్లో ప్రోత్సాహం అందించేలా కార్యక్రమాలు చేపడుతుంటారు. అంతేకాదు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకూ కృషి చేస్తున్నది ఐఐడబ్ల్యూ. క్షేత్రస్థాయిలో పని చేస్తూనే, సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ దేశాలకు చెందిన మహిళలతో కనెక్ట్ అవుతూ మార్పు కోసం ప్రయత్నిస్తున్నది. కొవిడ్ సమయంలో ఈ సంస్థ వలంటీర్లు రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు అండగా నిలిచారు. అలాగే ఎంతోమంది వృద్ధులు, ఒంటరి మహిళలకు వంట సామగ్రి, ఔషధాలు అందించారు. మానసికంగా కుంగిపోయిన వాళ్లకు వెబినార్ ద్వారా తగు సూచనలు అందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
ప్రత్యక్షంగా సేవలు అందించడమే కాకుండా, స్వచ్ఛంద సంస్థలకూ అండగా నిలుస్తున్నది ఐఐడబ్ల్యూ. 2018లో నక్షి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసి విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని మ్యాక్ మిల్లన్ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థకు అందించింది. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు నిర్వాహకులు. ఈ షోలో క్యాన్సర్‌ను జయించిన 15 మంది మహిళలు ర్యాంప్‌వాక్ చేసి ఆశ్చర్యపరిచారు. మరో కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను కొవిడ్ బాధితులకు అందించారు. ఇలా ఏటా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ.. విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందిస్తున్నారు రష్మి మిశ్రా! ప్రస్తుతం మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఐఐడబ్ల్యూ సేవలు అందిస్తున్నది. ప్రతిచోటా ఈ సంస్థ వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఐఐడబ్ల్యూ సభ్యులు రాజస్థాన్‌లోని విక్రమ్గఢ్కు వెళ్లి.. అక్కడి గిరిజన మహిళలు తయారుచేసిన హస్త కళాకృతులను కొనుగోలు చేసి.. వాటిని బ్రిటన్‌కు తరలించి, అక్కడ విక్రయాలు జరిపారు. తద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. ఈ ప్రయాణంలో రష్మి మిశ్రాను పలు అవార్డులు పలకరించాయి. ‘ఎక్సెప్షనల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. 2019లో బ్రిట్ఏషియన్ బ్యూటీ పీజెంట్స్ గ్లోబల్ నుంచి మరో అవార్డు పొందారు. మహిళా సాధికారత లక్ష్యంగా కృషి చేస్తున్న ఐఐడబ్ల్యూ.. అనుకున్నది సాధించే వరకు విశ్రమించదని చెబుతున్న రష్మి మిశ్రాను మనమూ అభినందిద్దాం.
నేను యూకేలో ఉంటున్నా సరే, నా మనసెప్పుడూ భారతదేశంలోనే ఉంటుంది. అందువల్లే ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. ఇది దేశ, విదేశాల్లోని భారత మహిళలను ఒక్కచోటికి చేరుస్తుంది. దానివల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా మేము ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై క్యాంపెయిన్స్ నిర్వహిస్తుంటాం. భారతదేశంలో ఉండే మా సంస్థ సభ్యులు నిత్యం క్షేత్రస్థాయిలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. మేము ఎక్కువగా గ్రామీణ మహిళలకు విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ హైజీన్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాం. అలాగే గృహ హింస బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటున్నాం. లండన్‌లో మా ఉమెన్ కమ్యూనిటీ ఎన్నో అంశాలపై చర్చిస్తూ, భారతీయ మహిళలకు ఉపయోగపడేలా కార్యాచరణను రూపొందిస్తున్నాం. మా సేవలు మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. ఆ దిశగా విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది.