హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘స్థానికత’ జీవో కారణంగా మెడికల్ అడ్మిషన్లకు దూరం అవుతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి సీఎస్ రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నాయకులు కురువ విజయ్‌కుమార్, కిషోర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణేతర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని ఏ విధంగా స్థానికులుగా పరిగణించి వారి పిల్లలకు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తున్నారో, అదే మాదిరిగా మెడికల్ అడ్మిషన్లకు అర్హత సాధించిన విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు రాష్ట్రంలోనే ఈ విద్యార్థులు చదువుకున్నారని, ఇంటర్మీడియట్లో వేర్వేరు కారణాలతో పక్క రాష్ట్రంలో చదువుకున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏపీకి సమీపంలో ఉండటంతో కొందరు తమ పిల్లలను విజయవాడలో చదవించారని వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొంతమంది కర్నూలులో తమ పిల్లలను చదవించారని చెప్పారు. ఈ చిన్న తప్పిదం కారణంగా విద్యార్థులను తెలంగాణ వారు కాదనడం సబబు కాదని హితవు పలికారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. సీఎస్ సానుకూలంగా స్పందించినట్టు దాసోజు శ్రవణ్ తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 40 మంది విద్యార్థులకు చేయని తప్పుకు శిక్ష పడకుండా వారందరిని స్థానికులుగా గుర్తించాలని దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు.
జీవో రాకముందే ఇంటర్ పూర్తి
ప్రస్తుతం ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా స్థానికత జీవో రాకముందే ఇంటర్ విద్యను పూర్తిచేశారు. హైదరాబాద్ మాకు 300 కి.మీ. దూరం ఉంటుంది. అందుకే ఆడపిల్ల దగ్గరే ఉండి చదువుకుంటుంది కదా అని విజయవాడలో చదివించాం. తెలంగాణలో 15 శాతం ఆలిండియా కోటా కింద వేర్వేరు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. 8 వేల మెడికల్ సీట్లున్న తెలంగాణలో స్థానికత వల్ల నష్టపోయే విద్యార్థులు 0.5 శాతమే. కనుక ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలి.
-షేక్ మహమ్మద్ జకీర్,(ర్యాంకు సాధించిన విద్యార్థిని తండ్రి) సత్తుపల్లి, ఖమ్మం జిల్లా