ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్నారు ఆ మహిళలు. తమకు ఇది సాధ్యపడుతుందా అని ఆలోచించే బదులు, ఎంచుకున్న రంగమేదైనా రాణించాలనే లక్ష్యంతో శ్రమించారు. కఠిన శిక్షణలు కలిగిన పోలీసుశాఖలో మరింత కష్టతరమైన అశ్వికదళంలో చేరి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇన్నాళ్లూ మగవాళ్లే ఉన్న అశ్విక దళంలో మహిళలూ రాణించగలరని నిరూపిస్తున్నారు వీళ్లు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్ పోలీస్ విభాగంలో భాగమయ్యారు ఓ తొమ్మిది మంది మహిళా కానిస్టేబుళ్లు. రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళమైన మౌంటెడ్ పోలీస్ మహిళాటీమ్లోని వారితో జిందగీ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ సంగతులే ఇవి…
మొన్న జరిగిన గణేశ్ నిమజ్జనం, మొహర్రం యాత్రల్లో జనసందోహాన్ని కట్టడి చేసేందుకు మహిళా పోలీసులు గుర్రమెక్కి గస్తీ కాయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న తొలి మహిళా అశ్విక దళానికి సంబంధించిన నారీమణులు వీళ్లు. సాధారణంగా జనంలో వెళుతూ గుర్రాన్ని కంట్రోల్ చేయడం కాస్త కష్టమైన పనే. అశ్వాన్ని అధిరోహించి గస్తీ కాయాలంటే మాటలుకాదు.. అది మగవాళ్లకే సాధ్యమనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇది నిజం కాదని, మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ మహిళా కానిస్టేబుళ్లు.
కొన్నేండ్లుగా మౌంటెడ్ పోలీస్ ఫోర్స్‌లో పురుషులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్న సంకల్పం నుంచి ఏర్పడిందే ఈ మహిళా అశ్విక దళం. వీరంతా 2024 ఆర్డ్మ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్‌కి చెందిన వాళ్లే. రెండువందల మంది మహిళల్లోంచి ఆసక్తి, ఫిట్నెస్ ఆధారంగా పది మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒకరు వేరే విభాగంలోకి వెళ్లగా ప్రస్తుతం తొమ్మిది మంది బృందం ఉన్నారు. వీరికి గుర్రపు స్వారీలో ఆరునెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. గుర్రాన్ని అదుపు చేయడం, దౌడు తీయించడం, జన సందోహంలో కూడా చెదరకుండా దాన్ని ముందుకు సాగేలా ఆదేశాలివ్వడం… లాంటివి ఇందులో నేర్పిస్తారు. ఈ మౌంటెడ్ ఫోర్స్ ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌లాంటి చోట్ల డ్యూటీ చేస్తుంటుంది. ర్యాలీలు, పండుగలు, నవరాత్రులు, శోభాయాత్రల వంటి జనసమ్మర్ధం ఉన్న సందర్భాల్లో గుర్రంపై ముందుండి నడుపుతూ బందోబస్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక, అవసరాన్ని బట్టి గుర్రాలకు ఆహారం అందించడం, ఇతర నిర్వహణబాధ్యతలను నిర్వర్తించడం కూడా బృంద సభ్యులు నేర్చుకున్నారు.
ఈ అశ్వికదళంలోని తొమ్మిది మంది మహిళలలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. ఇందులో కీర్తి బీకాం కంప్యూటర్స్ చేసి తెలంగాణ తరఫున ఆల్ ఇండియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. సుభద్ర బీపీఈడీ చేసి ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో చేసి, అక్కడ నుంచి తెలంగాణలో కానిస్టేబుల్‌గా వచ్చారు. తైక్వాండోలో నేషనల్స్ సాధించారు. జి.అఖిలాయాదవ్ క్లినికల్ బ్యూటీషియన్ కోర్సు చేసి మొదట్లో మెడికల్ ఫీల్డ్‌లో పనిచేసి, ఆ తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో పోలీస్‌గా చేరారు. పూజిత ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చేయగా, మొనాలిక అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఫుట్‌బాల్, యోగ, టేబుల్‌టెన్నిస్‌లో తెలంగాణ తరఫున నేషనల్స్ ఆడారు. ఎన్సీసీలో మంచి తర్ఫీదు పొందారు కొందరు. ఇలా చదువులతో పాటు ఇతర రంగాల్లోనూ రాణిస్తూనే, మరోవైపు గుర్రపుస్వారీతో తెలుగురాష్ర్టాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారీ మౌంటెడ్ ఫోర్స్ పోలీసులు.
మాది వనపర్తి. సాధారణ ఉద్యోగాల మీద తొలి నుంచీ పెద్దగా ఆసక్తి లేదు. ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలని మొదటినుంచి అనుకునేదాన్ని. కానీ పేదరికం అడ్డొచ్చింది. ఆప్యాయంగా వెన్నుతట్టి ప్రోత్సహించే నాన్న అందనంత దూరం వెళ్లిపోయాడు. అయినా సాధించాలనే తపనతో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాను. మౌంటెడ్ ఫోర్స్‌లో చేరిన తర్వాత ఆత్మైస్థెర్యం పెరిగింది.
గుర్రం ఎంత హల్చల్ చేస్తే నాకు అంత ధైర్యం వస్తుంది. ట్రైనింగ్‌లో ఎన్ని దెబ్బలు తగిలితే అంతగా గట్టిపడ్డాం. గుర్రాన్ని హ్యాండిల్ చేయడమంటే జీవితంలో సక్సెసయినట్లేనని భావించా. వాటి కదలికలు, అదుపు మీద బాగా దృష్టి పెట్టా. చక్కగా దాన్ని నడిపించడం నేర్చుకున్నా. ఇలా బందోబస్తుకు నేను గుర్రమెక్కి వెళ్లడం నాన్న చూసి ఉంటే ఎంతో సంతోషపడేవారు.
నాన్న రవీందర్ ఆటోడ్రైవర్. నేను ఇంటర్లో ఉన్నప్పుడే అమ్మ గుండెపోటుతో చనిపోయింది. మేం ముగ్గురు పిల్లలం. అందుకే, చదువు మానేద్దామనుకుంటే నాన్న ఒప్పుకోలేదు. ఆటో నడిపి మా అందరినీ చదివించారు. నేను బీకాం పూర్తి చేశాను. కాస్త ప్రత్యేకమైన రంగంలో పనిచేయాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకే పోలీస్ కానిస్టేబుల్‌గా చేరాను. తర్వాత మౌంటెడ్ ఫోర్స్‌లో అవకాశం వచ్చింది.
మొదట్లో గుర్రం చాలా దూరం లాక్కెళ్లింది. కానీ, ఆ సమయంలో పై అధికారులు ఎంతో ధైర్యమిచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా గుర్రాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. మా కుటుంబంలో నాదే తొలి ప్రభుత్వ ఉద్యోగం. అందులోనూ పోలీసు విభాగంలో హార్స్రైడర్గా చేరడంతో అందరూ ‘నీ బిడ్డ ఎంత ధైర్యంగా పనిచేస్తున్నదో…’ అని నాన్నతో అంటుంటే ఆయన పొంగిపోతున్నారు. అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది.
మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ కూలీ పనులు చేస్తుంది. మా ఇండ్లలో పదోతరగతిలోనే పెండ్లి చేసి పంపిస్తారు. నాకూ అలాగే జరిగింది. నాకు పెండ్లయి 13 సంవత్సరాలు దాటింది. ఇద్దరు మగపిల్లలు. పెండ్లయిన తర్వాత కొన్నిరోజులకు చదువుకొని ఉద్యోగం సాధించాలనుకున్నాను. దూరవిద్యలో బీఏ పూర్తి చేశాను. ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేశాను. ఎస్సై ఉద్యోగం చేయాలనుకున్నా కానీ, అప్పుడే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఉద్యోగం సాధించాను. నాకు రెండు డెలివరీలు సిజేరియన్లు అయ్యాయి.
దీంతో శిక్షణ సమయంలో స్టిచెస్ వద్ద నొప్పి వచ్చేది. మౌంటెడ్ ఫోర్స్‌లో చేరడానికి ఆసక్తి కలిగిన వారెవరంటే ముందుకు వచ్చా. ఫిజికల్ ఫిట్నెస్ లేక మొదట్లో కొంత ఇబ్బందిపడ్డాను. పొట్టిగా ఉంది, బక్క పలచన.. ఈమేం చేయగలదు అన్న వారున్నారు. అలా అని వెనక్కు వెళ్లిపోతే కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఫిట్‌నెస్‌మీద దృష్టి పెట్టాను. సక్సెస్ అయ్యాను. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అన్నీ సవాల్‌గానే చూడాలి. వాటితో పోరాడి గెలవాలన్న దృక్పథం ఈ హార్స్ రైడింగ్ ట్రైనింగ్‌లో ఏర్పడింది. మా పిల్లలు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
నా పేరు ఎం. రేణుక. మాది హైదరాబాద్. అమ్మానాన్నలు చీపుర్లు అమ్ముతూ మమ్మల్ని పోషించారు. మేం చదువుకుంటుంటే చీపుర్లు అమ్ముకునేవాళ్లకు చదువెందుకు అని కొంతమంది హేళన చేశారు. దాంతో మా మామయ్య నన్ను, అక్కను చేరదీశారు. ఇద్దరినీ కష్టపడి చదివించారు. అక్క డాక్టర్ అయింది. ఎంబీఏ ఫైనాన్స్ చదివిన నేను బ్యాంక్ జాబ్ చేయాలనుకున్నాను. అనుకోకుండా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. తర్వాత అశ్విక దళ శిక్షణలో చేరా. తొలుత గుర్రాన్ని అదుపు చేసే క్రమంలో కిందపడ్డా. బాగా దెబ్బలు తగిలాయి. అప్పుడు వెనక్కు వెళ్లిపోదామనిపించింది. కానీ, ఆ ఆలోచన నాకే నచ్చలేదు. దాంతో గుర్రాల కదలికలు గమనించడం, వాటిని అదుపు చేసే మెలకువల మీద దృష్టి సారించడం ద్వారా విజయం సాధించాను.