తిప్పర్తి/నీలగిరి, మార్చి 4 : నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం మరోమారు వార్తల్లో కెక్కింది. కాంగ్రెస్ నేత ఉట్కూరు సందీప్‌రెడ్డి మరోమారు అధికార మదంతో పొట్టదశకు వచ్చిన పంట పొలాన్ని మట్టితో పూడుస్తుండగా అడ్డుకున్న దళిత రైతులపై కులం పేరుతో దూషించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థులను కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన అరాచక నేత సందీప్‌రెడ్డి.. సర్పంచ్‌గా తన భార్యను గెలిపించుకున్న ఆరు నెలలు కూడా కాకముందే మరోమారు వార్తల్లో నిలిచాడు. సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య గెలుపునకు సహకరించలేదనే కారణంతో అనేక మందిపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పలు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టడడమే కాకుండా, వారి కుటుంబాలను రోడ్డున పడేసేందుకు కుట్రలు పన్నాడు. గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు కావడంతో సందీప్‌రెడ్డి కన్ను దళిత కుటుంబం పొలంపై పడింది. సబ్‌స్టేషన్‌కు గ్రామంలో అనేక వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా..కావాలనే తనకు వ్యతిరేకంగా పనిచేసిన పాతకోట్ల శ్రీనివాస్ భూమిని ఎంచుకున్నాడు.
శ్రీనివాస్ కుటుంబం 454 సర్వే నంబరులోని 30 గుంటల భూమిని 30 ఏండ్లుగా సాగుచేసుకుంటూ అస్సైన్డ్ కమిటీ ఆదేశాల మేరకు పట్టా పొందింది. నాటి నుంచి నేటి వరకు ఆ భూమే ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఇతర సర్వే నెంబర్లల్లో ప్రభుత్వ భూమి ఉన్నా కాదని..శ్రీనివాస్ సాగు చేసుకుంటున్న 30 గుంటల భూమిని గుంజుకునేందుకు కుట్ర పన్నాడు. అందులోనే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు పూనుకున్నాడు. మంత్రి కోమటిరెడ్డి చేతులు మీదుగా సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. గతనెల 28న 30 ట్రాక్టర్ల మొరంతో వరి సాగు చేస్తున్న పొలంపైకి వచ్చాడు. పంట పొట్ట దశలో ఉన్నా కనికరించకుండా పొలంలో మొరం పోసేందుకు యత్నించాడు. విషయం తెలిసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వచ్చి పొలంలో మట్టి ఎలా పోస్తారని, అది కూడా పొట్టదశలో ఉందంటూ కుటుంబం మొత్తం బతిమిలాడుకున్నారు. ఎంత బతిమలాడినా సందీప్‌రెడ్డి వినకుండా ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడే సబ్ స్టేషన్ కడతా..అడ్డువస్తే తగిన మూల్యం చెల్లించుకుంటావని బెదిరింపులకు పాల్పడ్డాడు.శ్రీనివాస్ కుటుంబం అడ్డుపడిడా వినకుండా కులం పేరుతో దూషిస్త్తూ కుటుంబ సభ్యులపై నుంచే మట్టి పొశారు. ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, తీర్పు వచ్చే వరకు మట్టి పోయవద్దని బతిమలాడినా వినలేదని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో శ్రీనివాస్ గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయ గా అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
30 ఏండ్లుగా 30 గుంటల భూమిని సాగు చేసుకుంటూ కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా కుటుంబమంతా ఆ భూమిమీదే ఆధారపడి జీవిస్తోంది. నా పొలంలో వరి వేసి, సాగుచేస్తుంటే పొట్టదశకు వచ్చిన సమయంలో సందీప్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి 30 ట్రాక్టర్లతో ఒకేసారి మట్టి తెచ్చి పొలం పూడ్చాడు. మా కుటుంబమంతా ఆపినా వినకుండా.. కులం పేరుతో దూషిస్తూ పక్కకు జరగకపొతే తొక్కిసంపుతానంటూ బెదిరించాడు. మా కుటుంబ సభ్యుల మీద మట్టి కూడా పోశారు.
ఎల్లమ్మగూడెంలో 454 సర్వేనెంబర్లో పాతకోట్ల శ్రీనివాస్‌కు 30 గుంటల భూమి ఉంది. కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2021లో ఆ భూమిని రద్దు చేశారు. ఆ భూమిని ప్రభుత్వ అవసరాల నిమిత్తం 2025లో విద్యుత్ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆ భూమిలో శ్రీనివాస్ సాగు చేస్తున్నాడు. గ్రామాధికారులు ఎలాంటి పంటలు సాగు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసినా, శ్రీనివాస్ ఖాతరు చేయకుండా పంటలు వేశాడు. దీనిపై మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.