‘వైదేహి పరిణయం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి యుక్తా మల్నాడ. నటన మీదున్న ఆసక్తితో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొని ముందుకు సాగింది. ప్రస్తుతం ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ సీరియల్లో లీడ్ రోల్లో అలరిస్తున్నది. బలంగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ దేవుడే గట్టెక్కిస్తాడంటున్న యుక్తా మల్నాడ ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
మాది చిక్మంగళూరు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు, సీరియళ్లు చూసేదాన్ని. అలా నటీనటుల మీద అభిమానం మొదలై, నటించాలన్న కోరిక పుట్టింది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఆ ఆరాటమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకుసాగేలా చేసింది. యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానంటే మొదట్లో అమ్మానాన్న ఒప్పుకోలేదు. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామన్నారు. ఆ మాటకు కట్టుబడి డిగ్రీ పూర్తిచేశాను. నాకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కూడా ఇష్టమే. అందుకే డిగ్రీ తర్వాత ఆ ఉద్యోగానికి అప్లయ్ చేశా. ట్రైనింగ్ కూడా పూర్తయింది. బెంగళూరులో ఇస్తారనుకుంటే కోల్‌కతా బేస్ ఇచ్చారు. బెంగళూరు అయితే సినిమాల్లో ప్రయత్నించవచ్చని నా ఆలోచన. దీంతో రెండు నెలలు జాబ్ చేసిన తర్వాత, పరిశ్రమలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను.
నాకు చిన్నప్పటినుంచీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డిగ్రీ రోజుల్లో ఒక పోటీలో పాల్గొన్నా. అక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన ఒక కన్నడ డైరెక్టర్ నన్ను చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామని వదిలేశా! నా స్నేహితురాలు కొరియోగ్రాఫర్‌గా ఏడు భాషల్లో పనిచేసింది. ఆమె ద్వారా మరో అవకాశం వచ్చింది. డిగ్రీలో ఉండగానే ఒక సినిమా చేశాను. కానీ, అది విడుదల కాలేదు. ఉద్యోగం మానేసిన తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నాలుగు సినిమాలు చేశాను. తెలుగు డైరెక్టర్ రవికిరణ్ గారు ఆయన కొడుకును కన్నడలో హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమాలో నన్ను హీరోయిన్గా తీసుకున్నారు. అలా నా నట ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు.
కన్నడ సినిమా చేస్తుండగా తమిళం నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నాకు కన్నడ, ఇంగ్లిష్ తప్ప వేరే భాషలు తెలియవు. కానీ, నన్ను నిరూపించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నా. కష్టమైనా, చాలెంజ్‌గా స్వీకరించి తమిళం నేర్చుకున్నా. ఆ ప్రాజెక్ట్ తర్వాత జీ తెలుగు ‘వైదేహి పరిణయం’లో అవకాశం వచ్చింది. తమిళం కంటే తెలుగు సులభంగా అనిపించి వెంటనే ఒప్పుకొన్నా. ప్రస్తుతం ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ సీరియల్లో కనకమహాలక్ష్మిగా చేస్తున్నా. నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర కావడంతో కథ వినగానే ఓకే చెప్పేశా. సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఇప్పుడున్న బిజీలో మా ఇంటికి వెళ్లడానికి కూడా వీలుపడట్లేదు.
అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదు. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మా ఊరంటే ప్రాణం. పచ్చని పరిసరాలు, పశుపక్ష్యాదులతో కళకళలాడే మా ఊరి వాతావరణం భలేగా ఉంటుంది. నాకు కవిత్వం రాయడం, డ్యాన్స్ అంటే ఇష్టం. మంచి సినిమాలు చేయాలని, విభిన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. చివరి వరకూ పరిశ్రమలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలని కోరిక. సౌందర్య, అనుష్క నాకు ఆదర్శం. నటుల్లో ప్రభాస్, దర్శన్, నాని, ఇమ్రాన్ హష్మీ అంటే ఇష్టం.
మన జీవితంలో ఏం జరిగినా అంతా దైవ నిర్ణయమే అని గట్టిగా నమ్ముతాను. తిరుపతి వేంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం. దేవుడి మీద నమ్మకంతోనే ఉద్యోగం వదిలేసి సినిమా పరిశ్రమలోకి వచ్చాను. ఈ రోజు మీ అందరి ముందూ ఇలా ఉన్నాను. అలాగే ప్రేమ, పెండ్లి కూడా సరైన సమయంలో తప్పక జరుగుతాయి. ఇవి మన చేతిలో ఉండవు. సంతోషకరమైన జీవితం గడపాలంటే పేరు మాత్రమే కాదు, డబ్బు కూడా ముఖ్యం. నా సంపాదనలో సగం సమాజసేవ కోసం వినియోగించాలని ఆలోచన ఉంది. దాన్ని ఎలా చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ, నా శక్తిమేరకు నలుగురికీ సాయం చేయాలనే సంకల్పం అయితే బలంగా ఉంది.
– హరిణి