అది శివునిపల్లె. ఉమ్మడివరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం. ఆమె పేరు చెప్పగానే ‘సక్కగపోయి కుడిచేయి సందుల తిరిగి కొద్దిల దూరం పోంగనే.. పెద్దపరాడిగోడ (ప్రహరి).. లోపల పెద్దచెట్లుంటయి. అదే ఇల్లు. అట్లనే పోయాం. ఆమె బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఒక పెద్దావిడ దగ్గర ఆమె నిల్చున్నరు. అంతపెద్దావిడ తన తలను పేపర్లో దూర్చిన తీరుకు ఆశ్చర్యమేసింది. ఆ పెద్దావిడకు 93 ఏండ్లని తెలిసి ‘మరి మనం’ అనుకొని లోలోపలే. నజర్ ఆననితనంలోనూ లోకమ్మీద ‘ఏం జరుగుతున్నది’ అనే ఆసక్తి. ఆ తల్లి పక్కన్నే ఆమె వేలును విడవని బిడ్డ. అదే కదా ‘తల్లివేరు’. మమ్మల్ని చూసి ‘రండీ..రండీ’ అంటూ లోపలికి పిలిచారు. ఆవిడే నెల్లుట్ల రమాదేవి. 2025వ సంవత్సరానికి ప్రజాకవి కాళోజీ పురస్కారం పొందిన ఆమె.. తన సాహితీ, కుటుంబ ప్రయాణాన్ని చెప్తూవెళ్లారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది శివునిపల్లె. నేను పదో తరగతి వరకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో చదువుకున్న. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి కాలేజీలో చేసిన. ఆంధ్రాబ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయిన. మాది ఉమ్మడి కుటుంబం. పిల్లలకు అమ్మమ్మ నాయినమ్మ, తాతయ్యల ప్రేమలు దూరం చేయాలని కోరుకోలేదు. అందరూ కలిసి ఉంటేనే పిల్లలకు కష్టంసుఖం.. ప్రేమలు తెలుస్తాయి. అందుకే ఊరిలోనే ఉన్నం. మా తల్లిదండ్రులు నెల్లుట్ల శకుంతలాదేవి, నెల్లుట్ల రామచందర్‌రావు. భర్త దేవేందర్. ఇద్దరు పిల్లలు ధ్రువతేజ్. నయన్‌దీప్. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నరు. నాకు అదృష్టం కొద్దీ స్నేహితుడిలాంటి భర్త దొరికాడు. కానీ, దురదృష్టం ఏమంటే వారు 2009లో మరణించారు. చాలాకాలం నేను డిప్రెషన్‌కు లోనయ్యా. నా పిల్లలు, మా ఇంట్లో పెద్దల సహకారంతో కాస్త తేరుకున్న.
ప్రజాకవి కాళోజీ తెలంగాణ ధిక్కార బావుటా. పోతన ధిక్కారమేదో కాళోజీ ధిక్కారం అదే! నిజాయతే బలం అని జీవితాంతం నమ్మి, ఆచరించిన వైతాళికుడు కాళోజీ! ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారం నాకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్న. అందులోనూ ఆ పురస్కారం స్వీకరించిన తొలి మహిళగా గర్వంగా ఉంది. వరంగల్‌ది కలుపుగోలు కల్చర్. కాళోజీ ఇంట్లో నడిచే మిత్రమండలి… వరంగల్ కవులు, రచయితలకు గొప్ప ఊరటగా, ప్రోత్సాహంగా ఉండేది. పని ఒత్తిడి వల్ల నేను కొన్నిసార్లే మిత్రమండలికి పోగలిగిన. కాళోజీ కొడుకు రవికుమార్ బ్యాంకులో నాకు కొలీగ్. కాళోజీ ఇంటికి ఎప్పుడు పోయినా ‘ఎట్లున్నవ్ బిడ్డా… ఏమన్న రాస్తున్నవా లేదా?’ అని అడిగేది. మిత్రమండలిలో కొన్నిసార్లు కవితలు చదివిన. కాళోజీ అంటే అందరికీ భయం ఉండేది. మీటింగ్‌లో ముంగటనే కూర్చునేటోడు. తరచూ రాయకపోతే నా జాబ్ నేచర్‌ను బట్టి సెటైరిక్‌గా ‘పైసలు మీదికి అయినయి. కవిత్వం కిందికి అయిందా?’ అనేటోడు. ఈ తరం వాళ్లకే కాదు ఏ తరం వాళ్లకైనా తెలంగాణ భాషకు ‘తల్లివేరు’ కాళోజీ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ, మన భాషమీద వెక్కిరింతలు ఆగలేదు. గతంలో ఆఫీసుల్లోగానీ, బ్యాంకుల్లో గానీ ఎక్కడైనా మన భాషపట్ల, మన సంస్కృతి పట్ల వింత వైఖరి కనిపిస్తుండే. ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవాళ్లు మన యాసను ఎక్కిరిస్తుండే. యాసను మాత్రమే కాదు మనుషుల పేర్లకు కూడా పేర్లుబెట్టేది (ఎగతాళి చేసేది). మా బ్యాంకులో వడ్డెపల్లికి చెందిన కొలీగ్ ఉండేవారు. ఆయన పేరు అయిలయ్య. అందరూ ‘అయిలయ్య ఏందయ్యా?.. ఆయిల్ అయ్యలాగా’ అని హేళన చేస్తే.. గట్టిగనే రియాక్ట్ అయినం. ‘వేంకటేశ్వరస్వామి ఉన్న ప్రాంతంలో తిరుపతి, తిరుమల అని ఎట్ల పేరు పెట్టుకుంటరో.. మా దగ్గర ఐనవోలు మల్లికార్జునస్వామి ఉన్నడు కాబట్టి అయిలయ్య అని, యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి పేరుమీద యాదగిరి అని, వేములవాడ రాజరాజేశ్వరస్వామి భక్తులు రాజన్న అని సమక్క, సారలమ్మ గుర్తుగా సమ్మయ్య, సారయ్య, సమ్మక్క, సారక్క అని పేరు పెట్టుకుంటం. అందులో తప్పేముంది’ అని నిలదీస్తే గమ్మునున్నరు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కమాటలో చెప్పాల్నంటే తెలంగాణ మాండలికం అంతకుముందు సినిమాల్లో హాస్యనటులు, విలన్ల భాష.. అదే ఇప్పుడు హీరోల భాష అయింది. తెలుగు సినిమా… తెలంగాణ సినిమా అయింది. వాళ్లది జూదాలు, కోడిపుంజుల కల్చర్ అయితే.. మనకు బతుకమ్మ సెలబ్రిటీ అయింది. అది చాలదా? ఇయ్యాల తలెత్తిన పువ్వు తెలంగాణ.
మా అమ్మమ్మగారిది బమ్మెర. మా అమ్మ బమ్మెర పోతన వంశస్తురాలు. తను చదవటమే కాకుండా మమ్మల్నీ చదువుకునేందుకు ప్రోత్సహించేది. మా అమ్మ వల్లే నాకు చదువు చక్కగా అబ్బింది. ఆమె పోపుల డబ్బాలో ఉన్న పైసలు తీసుకొని పుస్తకాలు కొనిచ్చేది. మేం పెరుగుతున్న క్రమంలో ఏ ఏజ్‌లో చదవాల్సిన పుస్తకాలను ఆ ఏజ్‌లో చదివించేది. మొదాలు మొదాలే మాకు ‘చలం’ పుస్తకాలు ఇవ్వలేదు. మేం టెన్త్‌కు వచ్చేసరికే షార్ట్ స్టోరీస్ చదువుతుంటిమి. అట్లా పఠనం మీద, సంస్కృతి మీద, మానవ సంబంధాల మీద, నీతి, నిజాయతీల మీద మాకొక అవగాహన ఏర్పడింది. కుటుంబం, పరిసరాలు, బడి నుంచి ఇవన్నీ అలవడినయి. మాకు చదువు చెప్పినసార్లు గొప్పోళ్లు. వాళ్లు పాఠాలు చెప్పిన విధానం అద్భుతం. ఆ రోజుల్లో చుక్కపద్యాలు చదవకపోతే ఖతమే. అట్లా మాకు తెలుగుమీద ఆసక్తి కలిగింది. ఇప్పుడు అలాంటి టీచర్లు లేరని కాదు. ఇప్పుడున్న వాళ్లకు అన్నీ నిబంధనలే! ఏ టీచర్ అయినా పిల్లలకు బుద్ధిమాటలు చెప్పేందుకు కొంచెం కఠినంగా వ్యవహరిస్తే వాళ్ల పని అయిపోయినట్టే. పరిస్థితులు ఇట్ల మారడం వల్ల ‘నీకు చదువు వస్తే నాకేంది రాకుంటే నాకేంది? విద్యార్థిని ఒక మాట అనే హక్కులేనప్పుడు నా జీతం మందమే చదువుచెప్తా’ అన్నట్టు ఉంటున్నరు. నిజానికి పిల్లల్ని ఏమీ అనకుండా పెంచాల్నంటే కుదరదు. కొన్నిసార్లు డిసిప్లీన్ అవసరం. అప్పుడు టీచర్ అంటే ‘గజ్జున’ వణికేది. కాస్త శ్రద్ధ పెట్టకపోతే గట్టిగా మందలించేవాళ్లు. అవసరమైతే కఠినంగా శిక్షించేవాళ్లు కూడా!
నాకు గుర్తున్నంతవరకు నేను తొమ్మిదో తరగతిలోనే ‘స్నేహం’ అనే నాటిక రాసిన. దాన్ని ప్రదర్శించారు కూడా! మా ఊళ్లో లిఖిత మాస పత్రిక ‘నెలవంక’లో చిన్నచిన్న పద్యాలు రాసేది. తరువాత నా 16వ యేట అనుకుంటా.. ఒక కథ రాసిన. అది ‘బుజ్జాయి’లో అచ్చయింది. 1980లో స్వాతి మంత్లీ మ్యాగజైన్లో నా మొదటి కార్టూన్ పబ్లిష్ అయింది. బాపు, చంద్ర, శంకు, జయదేవ్ వంటి ఎంతో మంది కార్టూనిస్టులతో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఒకరకంగా చెప్పాల్నంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటి మహిళా కార్టూనిస్ట్‌ను నేను. కథలూ, కార్టూన్లుగా సాగే నేను కవిత్వం రాయటం ఆలస్యంగా మొదలుపెట్టిన. 1986 వరకు అసలు పోయెట్రీ రాయలేదు. ఒకవేళ నాకేదైనా అనిపించి రాసినా పబ్లిషింగ్కు ఇవ్వలేదు. కారణం.. అప్పుడు వీవీ (వరవరరావు) సర్ వరంగల్ నుంచి ‘సృజన’ పత్రిక తెచ్చేది. అందులో వచ్చే కవిత్వం చూసి ఆశ్చర్యమేసేది. విప్లవ కవిత్వం, భావకవిత్వం ఈ రెండు దృక్కోణాలు. అయితే, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, బాలగంగాధర తిలక్, దాశరథి, సినారె ఇలా గొప్పగొప్ప వాళ్ల కవిత్వం, పాటలు చూసి మనది కవిత్వం కాదు అనుకునేది.
వరంగల్‌లో శ్రీలేఖ సాహితీ శ్రీరంగస్వామి కవి సమ్మేళనాలు పెడుతుండేవారు. వారికి ఎట్లా తెలిసిందో కానీ, ‘మీరు కవిత్వం రాయండి’ అని పిలిచేవారు. వరంగల్‌కు ఆకాశవాణి కేంద్రం వచ్చినాంక కార్టూనిస్టుగా నా అనుభవాలు అడిగిండ్రు. చెప్తూ చెప్తూ ‘నేను పోయెట్రీ కూడా రాస్తాను కానీ ఇప్పటి వరకు ఎక్కడా చూపించలేదు’ అన్నాను. మీరు రాసుకున్నవి.. మీకు గుర్తున్నవీ చెప్పండి అన్నరు. ‘బిగించి ఎత్తిన పిడికిళ్లే తప్ప/ భుజం తట్టి ఓదార్చే చేతులేవీ?’ అని లైన్ నేను గతంలో రాసిన రెండు వాక్యాలు చెప్పిన. అంతే మీరు పోయెట్రీ రాయండి, కవి సమ్మేళనాలకు హైదరాబాద్ రండి అంటే నవ్వి ఊరుకున్న. ఒకసారి బీఎడ్ కాలేజీ ఓపెన్ ఆడిటోరియంలో కవి సమ్మేళనంలో నాకు పోయెట్రీ చదివే అవకాశం వచ్చింది. అప్పుడు జె.బాపురెడ్డి, రామా చంద్రమౌళి లాంటివాళ్లతోపాటు పోయెట్రీ చదివిన. బాపురెడ్డి గారు ‘మీరు చాలా బాగా రాస్తున్నారు. రాయండీ’ అని మెచ్చుకున్నారు. 1986లో నాకు బ్యాంక్ జాబ్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగే కాజీపేట్. రాఘవపూర్ (స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గర)లో బుచ్చిరెడ్డి అని ఒకసార్ ఉండేవారు. ఆ సార్‌కు ఫ్రెండ్ అంపశయ్య నవీన్ సర్. ఒకసారి బుచ్చిరెడ్డి సర్ నవీన్ సార్‌ను బ్యాంక్‌కు తీసుకొచ్చిండు. కౌంటర్లో ఏదో వర్క్ చేస్తుంటే ‘నవీన్ సారొచ్చిండు’ అని పరిచయం చేసిండు. ‘అబ్బో… నవీన్సార్ అంటే ఈయనా..!’ అనుకున్న. ఇలా బ్యాంకు ఉద్యోగం చేస్తున్నా.. సాహితీ ప్రపంచానికి దగ్గరగానే ఉన్న. చిన్నప్పటి నుంచి చదువుకోవటం, కొంత ఊహ తెలిసిన తరువాత రాయటం, ఎదుగుతున్న కొద్దీ సమాజానికి ఏదైనా చేయాలనే తపన. అందులోంచే సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు రచనా వ్యాసంగంలో నిమగ్నమయ్యా. రాశిగా నేను రాసినవి తక్కువేకానీ, సమాజహితం, రుగ్మతల పరంగా అవి వాసిగల్లవేనని చాలామంది అంటరు. కాళోజీ పురస్కారంతో నా రచనలకు మరింత గౌరవం దక్కిందని భావిస్తున్న.
నిజానికి ఈ టైమ్‌లో అనిశెట్టి రజిత (ఇటీవల మరణించిన ప్రముఖ కవి, రచయిత, కథకురాలు) ఉంటే బావుండేది. ఒకవేళ ఆమె ఉండి ఉంటే తనకే ఈ అవార్డు వచ్చేదేమో! అనేది నా ప్రగాఢ విశ్వాసం. రజితక్క కూడా బాగా కష్టపడ్డది. మహిళల హక్కుల కోసం కొట్లాడేది. కాళోజీనీ ‘కాళన్నా…’ అంటూ తన రచనల్లో పిలుచుకునేది. పరిధిని పెంచింది.. సమయాన్ని తినేసింది బ్యాంకు ఉద్యోగజీవితం నా పరిధిని, వివిధ సమూహాల సంబంధాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. అదేటైంల నా సమయాన్నీ తినేసింది. నాకున్న పబ్లిక్ రిలేషన్ వల్ల నాకు ఎప్పుడూ మార్కెటింగ్ ఆఫీసర్, పీఆర్వో, సీఆర్వో (క్లయింట్ రిలేషన్ ఆఫీసర్) ఇవే బాధ్యతలు అప్పగించేది. మా సమస్యల గురించి కూడా మేం సమ్మే చేసే అవకాశం ఉండదు. ఒకవేళ సమ్మె చేస్తే నెల ముందే ఆర్బీఐకి నోటీసు ఇవ్వాలె. ఒక్క రోజు సమ్మె చేయాలన్నా.. కష్టమే. కానీ, వేరే డిపార్ట్మెంట్స్ సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవు ఇస్తరు. కానీ మాకు అలా కాదు. కచ్చితంగా సాలరీ కట్ అయ్యేది.