Sleeping | న్యూఢిల్లీ, అక్టోబర్ 24: మధ్యవయసులో గాఢ నిద్రలేకపోతే.. ఆ వ్యక్తి మెదడు త్వరగా ముసలితనం బారినపడుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 50 ఏండ్లు వచ్చేసరికి ఆ వ్యక్తి మెదడు వేగంగా ముసలితనం పొందే అవకాశముందని తెలిపింది. వీలైనంత తొందరగా నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవాలని అధ్యయనంలోని నిపుణులు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన పరిశోధనపై ‘న్యూరాలజీ’ జర్నల్ వార్తా కథనం వెలువరించింది.
దీని ప్రకారం, 40 ఏండ్లున్న 589 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. పరిశోధన మొదలైన తొలి ఏడాది, 5 ఏండ్ల తర్వాత, 15 ఏండ్లకు వారి మెదళ్లను స్కానింగ్ చేసి పరిశీలించారు. 15 ఏండ్లలో మెదడు కుంచించుకుపోయిన విధానాన్ని బట్టి.. మెదడు వయసును నిర్ధారించారు. నిద్రరీతుల్ని బట్టి వివిధ గ్రూపులుగా విడగొట్టగా, హై-రిస్క్ గ్రూప్లో ఉన్నవారి మెదడు వయసు 2.6 ఏండ్లు ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.