మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్వయం పరిపాలన వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు ఇలాంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహనికి ఆర్థిక సాయం అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉన్న ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగుల సంక్షేమం కోసం ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, తహసీల్దార్ అనితారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు జయవంత్, మహబూబ్, సురేందర్‌గౌడ్, రాజు పాల్గొన్నారు.