యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘నిన్నమొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యిర్రు. కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయారాం.. గాయారాంలకు భయపడేదిలేదు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించా. నా పిలుపు మేరకు మందుల సామేల్‌ను గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని సామేల్‌పై ఫైర్ అయ్యారు. టికెట్ ఇప్పించి, గెలిపించి వ్యక్తిపైనే మాట్లాడుతున్నారంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ ఇప్పించాలని తన దగ్గరకు సామేల్ వంద సార్లు వచ్చారన్నారు. తుంగతుర్తితో తనకు సంబంధం లేకపోతే సీటు ఇప్పించాలని ఎందుకు అడిగారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిపించానన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనలాంటి వ్యక్తులపై ఉందన్నారు. కార్యకర్తల రెక్కలకష్టంతో గెలిచి, వారిపైనే కేసులు పెడతామంటే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. తనపై సామేల్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా స్పందించొద్దని నాయకులకు సూచించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టులు, ప్రెస్మీట్లు పెట్టొద్దన్నారు.
మందుల సామేల్; దళిత నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం రాజకీయాలపై వ్యాఖ్యానించే నైతిక హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం గు రించి గాంధీభవన్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ‘ముందు నీ మునుగోడు మురికిని చూసుకో.. మునుగోడులో అభివృద్ధి జరగలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దీనికి రాజగోపాల్‌రెడ్డి సమాధానం చెప్పా లి’ అని అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని అన్నారు. రాజ్యాంగం ప్రకారం తనకు టికెట్ వచ్చిందన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై రాజకీయాల్లోకి రాలేదన్నారు. కోమటి రెడ్ది బ్రదర్స్‌పై రాహుల్‌గాంధీ, ఖర్గేలకు ఫిర్యాదు చేస్తానన్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశానికి 67 వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలు తనకు తుంగతుర్తిలో 50 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నియమించిన పార్టీ మండల అధ్యక్షులే కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీలకు, మరొకటి యాదవ సామాజికవర్గానికి కేటాయించాలని కోరారు.