Rahul Gandhi | న్యూఢిల్లీ, జూన్ 5: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌లో మరోసారి విజయం సాధించిన రాహుల్.. ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇందుకు రాజకీయ కారణాలు ఉన్నాయి. 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన రాష్ట్రం. గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యూపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం ఆరు స్థానాలు సాధించి మళ్లీ పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో యూపీలో బలపడే దిశగా రాయ్‌బరేలీ నుంచి కొనసాగేందుకు రాహుల్ మొగ్గు చూపవచ్చని అంటున్నారు.