దుండిగల్, సెప్టెంబర్ 26: గాజులరామారంలోని హైడ్రా బాధితులకు అండగా నిలుస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ భరోసానిచ్చారు. నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం (సర్కిల్) డివిజన్ సర్వేనంబర్ 307లోని గాలిపోచమ్మబస్తీ, బాలయ్యనగర్ బస్తీలోని పేదప్రజల ఇండ్లను ఈనెల 21వ తేదీన హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్ ఆయా బస్తీలల్లో పర్యటించారు. హైడ్రా అధికారులు కూల్చివేసిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వేనంబర్ 307లో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చడం దారుణమన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూల్చివేతలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
గాజులరామారం డివిజన్ మెట్కానిగూడలోని అయ్యప్పకాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప దేవాలయం కాలనీ ముఖద్వారం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వివేకానంద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు సంక్షేమసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.